తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓట్ల తొలగింపులో వైఎస్సార్​సీపీ నేతల కుట్ర - పట్టనట్లుగా ఎన్నికల సంఘం - క్రిమినల్‌ కేసులు

Votes Deletion in AP: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం-7ను వేల సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. అయినా కేంద్ర ఎన్నికల సంఘం కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. నేరాలు ఆధారాలతో బట్టబయలైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయలేదు. చేసినా నిందితులపై కఠిన చర్యలు తీసుకోని పరిస్థితి నెలకొంది. వాటిన్నింటి మధ్య సారూప్యత ఉందా. తెర వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు వంటి అంశాలపై సమగ్ర వివరణ.

votes_deletion_in_ap
votes_deletion_in_ap

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 7:08 AM IST

ఓట్ల తొలగింపులో వైఎస్సార్​సీపీ నేతల కుట్ర - పట్టనట్లుగా ఎన్నికల సంఘం

Votes Deletion in AP: వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ వైనాట్‌ 175 అనే నినాదంతో ఏపీలో ముందుకెళ్తోంది. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రతిపక్షాల సానుభూతిపరులు, తటస్థుల ఓట్లను తొలగించే పనిలో వైఎస్సార్​సీపీ నిమగ్నమైంది. ఇందుకు ఆ పార్టీ నేతలు భారీగా ఫారం -7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. దోషులపై కేసులు పెట్టకుండా, సూత్రధారులపై దర్యాప్తు చేయకుండా వదిలేస్తుంది. దీంతో వైఎస్సార్​సీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో సీఈసీ ఉన్నతాధికారుల సమీక్ష జరగనున్న వేళ వైఎస్సార్​సీపీ తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రేక్షక పాత్రకే పరిమితమైన ఎన్నికల సంఘం: రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో వైఎస్సార్​సీపీ భారీగా ఫారం-7 దరఖాస్తుల్ని దాఖలు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతోంది. పలు నియోజకవర్గాల పరిధిలో ఆధారాలతో సహా ఈ కుట్ర బట్టబయలైనప్పటికీ ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయలేదు. పైగా దరఖాస్తులు సవ్యంగా ఉన్నాయంటూ తేల్చేసింది.

రా కదలి రా సభ వాయిదా - సీఈసీ బృందాన్ని కలవనున్న బాబు, పవన్

ఇలా అయితే వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలి: మరికొన్ని నియోజకవర్గాల పరిధిలో తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేయించినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదు. కీలకంగా ఉన్న కొంతమందిని నిందితులుగానే చేర్చలేదు. సాధారణంగా ఒకే తరహా నేర విధానంతో పలు చోట్ల ఘటనలు జరుగుతుంటే వాటిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలి. వాటిన్నింటి మధ్య సారూప్యత ఉందా. తెర వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు. వంటి తీగల్ని లాగి డొంకను కదల్చాల్సి ఉంటుంది.

విచారణకు దిగడం లేదు: ఈ కేసులన్నింటిలోనూ నిందితులు వైఎస్సార్​సీపీ వాళ్లే కావటంతో పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లట్లేదు. ఒక్కరినీ అరెస్టు చేయలేదు. నోటీసులిచ్చి విచారించటానికీ సాహసం చేయట్లేదు. మేం ఫిర్యాదు చేశాం కేసు నమోదైంది. మా పనైపోయిందన్నట్లు ఎన్నికల సంఘం చేతులు దులిపేసుకుంటోంది. అంతే తప్ప దర్యాప్తు సవ్యంగా సాగేలా పర్యవేక్షించట్లేదు. ఫలితంగా నేరపూరిత కుట్ర వెనకున్న అసలు వ్యక్తులు తప్పించుకుంటున్నారు.

విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?

సీఈసీ అధికారుల సమీక్ష వేళ విచారణకు డిమాండ్​ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు నేడు, రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్​సీపీ నేతృత్వంలో సాగుతున్న ఓట్ల తొలగింపు కుట్రపై సమగ్ర విచారణకు ఆదేశించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పట్టించుకోని ఎన్నికల సంఘం : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం- 7 దరఖాస్తుల దాఖలుపై తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులిచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు కొంతమంది వైఎస్సార్​సీపీ నేతలపై ఫిర్యాదు చేయటంతో 10 కేసులు నమోదయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై ఏపీ అధికారులతో సీఈసీ భేటీ

పర్చూరు నియోజకవర్గంలో అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీ కీలక నేత ఓట్ల తొలగింపు వెనక ఉన్నారు. అయినప్పటికీ నమోదైన పది కేసుల్లోనూ ఆయన ప్రస్తావనే లేదు. నిందితులను విచారిస్తే అరాచక శక్తిని బయటకు లాగొచ్చు. పోలీసు యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో కుట్రను బయట పెట్టేవారే లేకుండా పోయారు.

దొంగకే తాళలిస్తారా అనే ప్రశ్నలు : ఈ ఓట్ల తొలగింపులో పర్చూరులోని పలువురు ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకూ ప్రమేయం ఉందని తేలటంతో వారు సస్పెన్షన్‌కు గురయ్యారు. అలాంటిది మళ్లీ అక్కడి పోలీసులకే ఈ కేసుల దర్యాప్తు బాధ్యతల్ని అప్పగిస్తే సూత్రధారి బయటపడతారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల నగారా మోగే నాటికే స‌మ‌గ్ర ప్రణాళిక‌తో సిద్ధంగా ఉండాలి : సీఈసీ బృందం

వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా ఒక్క కేసు లేదు: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు, అవకతవకలు రాష్ట్రంలో ఇంకెక్కడా జరిగి ఉండవు. ఇక్కడ తెలుగుదేశం ఓట్ల తొలగింపునకు వేలసంఖ్యలో ఫాం-7లను అర్జీలు పెట్టారు. ఇంత మొత్తంలో దరఖాస్తులు వస్తే కేవలం, ఒకే ఒక్క కేసు నమోదైంది. ఇక్కడ అధికార పార్టీ ముఖ్యనేత ఆధ్వర్యంలోనే ఓట్ల తొలగింపు జరుగుతుండగా అతని ప్రమేయంపై దర్యాప్తే లేదు.

కాకినాడ నగరం, బనగానపల్లె, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో నమోదైన కేసుల్లోనూ సూత్రధారులెవరో దర్యాప్తులో తేల్చలేదు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 2 వేల 799 ఓట్లను తొలగించాలంటూ గతేడాది సెప్టెంబరు 29న 30 మందికి పైగా గంపగుత్తగా ఫాం-7 దరఖాస్తులు పెట్టారు. వీరంతా వైెస్సార్​సీపీ శ్రేణులే.

పిఠాపురం నియోజకవర్గంలో 12 వేల 500 ఓట్ల తొలగింపునకు 862 మంది ఫాం-7 దరఖాస్తులు చేశారు. గురజాల నియోజకవర్గంలోనూ భారీగా ఫాం-7లు పెట్టారు. తెలుగుదేశం ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించి దరఖాస్తులన్నీ సవ్యమేనని తేల్చేసింది. వాస్తవంగా వాటిలో అత్యధికం తప్పుడు సమాచారంతో కూడినవేనని అయినా అంతా సవ్యంగా ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు నివేదికలిస్తే ఎన్నికల సంఘమూ అదే విషయాన్ని చెప్పటమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి- తొలిరోజు సమీక్షలో అధికారులతో సుదీర్ఘ చర్చ

ఓట్ల తొలగింపునకు వాలంటీర్లకు దిశానిర్దేశం: కావలి నియోజకవర్గంలో మనవి కానివి, మనకు వేయరనుకునే వారి ఓట్లను తొలగించేందుకు ఫాం-7 దరఖాస్తులు చేయాలని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన పార్టీ శ్రేణులకు, వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఆ ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

వీడియోలు వైరల్​గా మారిన ఘటనను బట్టే అక్కడ కుట్రపూరితంగా ఫాం-7 దరఖాస్తులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. అయినా సరే దరఖాస్తులన్నీ సవ్యమేనని తేల్చేయటమేమిటో ఎన్నికల సంఘం అధికారులకే తెలియాలి. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే మూడో పక్షంతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయి.

వివాదాస్పదంగా వాలంటీర్ వ్యవస్థ.. 'కలెక్టర్లకు సీఈసీ హెచ్చరిక'

అంతా వైఎస్సార్​సీపీ సానుభూతిపరుల పనే: 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వైఎస్సార్​సీపీ ఇదే తరహా నేరపూరిత కుట్రను అమలు చేసింది. లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లను తొలగించాలంటూ ఫాం-7 దరఖాస్తులు చేయించింది. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్య ఓట్ల తొలగింపునకు 12 లక్షల 50 వేల ఫాం-7 దరఖాస్తులు అందగా వాటిల్లో 80 శాతం వైఎస్సార్​సీపీ సానుభూతిపరులు, నాయకులే చేసినట్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఆ తర్వాత వైెస్సార్​సీపీ అధికారంలోకి రావటంతో ఆ కేసులన్నింటినీ నీరుగార్చేశారు.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరపూరిత కుట్రను ఇప్పుడు అధికారం అండదండలతో అధికార పార్టీ మరింత వ్యవస్థీకృతంగా అమలు చేస్తోంది. దీని నిగ్గు తేలాలంటే ఎన్నికల సంఘం తన పర్యవేక్షణలో పనిచేసేలా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలి. సూత్రధారుల్ని బయటకు లాగాలి.

నిజాలను నిగ్గుతేల్చాల్సిన భాద్యత ఎన్నికల సంఘానిదే : ఇప్పటివరకూ కాకినాడ నగరంలో 13, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1, చంద్రగిరిలో 1, బనగానపల్లెలో 1, పర్చూరు నియోజకవర్గంలో 10 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల కేసులు నమోదు చేయాల్సి ఉన్నా చేయలేదు. వీటన్నింటినీ సిట్‌ పరిధిలోకి తీసుకొచ్చి కుట్రను నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.

'స్థానిక ఎన్నికలను సీఈసీ ఆధ్వర్యంలో జరపాలి'

ABOUT THE AUTHOR

...view details