Voters Demand For Gun License : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఓటర్ల నుంచి వినూత్న డిమాండ్లు ఎదురవుతున్నాయి. ఆ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని నిర్మూలించడానికి బింద నియోజకవర్గ ప్రజలు తమకు ఏకంగా తుపాకీ లైసెన్సులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తుపాకీ లైసెన్స్ లభిస్తే.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా తాము సెక్యూరిటీ ఉద్యోగాలు చేసుకోవచ్చని వారు విశ్వసిస్తున్నారు. నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని ఓటర్లు ఈ రకమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
'తుపాకీ లైసెన్స్ డిమాండ్ న్యాయమైనదే'
బింద నియోజకవర్గ ప్రజల వినూత్నమైన డిమాండ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్ చతుర్వేది స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని నిరుద్యోగ సమస్యకు బీజేపీ ఇంతవరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఓటర్లు అడుగుతున్న తుపాకీ లైసెన్స్ డిమాండ్ న్యాయమైనదేనని చతుర్వేది అన్నారు. ప్రజలకు తుపాకీ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఆత్మరక్షణగా కూడా ఉపయోగపడడమే కాక.. ఉద్యోగాలు కూడా లభిస్తాయని చతుర్వేది తెలిపారు. మరోవైపు ఓటర్ల తుపాకీ లైసెన్స్ డిమాండ్‌పై అధికారంలోకి రాగానే.. ప్రభుత్వంతో మాట్లాడి నెరువేరుస్తామని బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్ కుశ్వాహ హామీ ఇచ్చారు.
ఓటర్లకు ఫ్రీగా జిలేబీ, స్నాక్స్!
Madhya Pradesh Election Schedule : 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నవంబర్ 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్‌లో చిరు వ్యాపారులు తమ వంతుగా వినూత్న కృషి చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఉచితంగా అల్పాహారం అందించాలని నిర్ణయించారు.