బంగాల్ నాలుగో విడత పోలింగ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. కూచ్బెహార్ జిల్లా సీతల్కుచిలోని ఓ పోలింగ్ బూత్ ముందే ఓటరును కాల్చి చంపారు దుండగులు. ఈ హత్య భాజపా పనేనని టీఎంసీ ఆరోపించింది. మృతి చెందింది తమ కార్యకర్తేనని.. అధికార పార్టీనే ఈ దారుణానికి ఒడిగట్టిందని భాజపా ఆరోపించింది.
మృతి చెందిన యువకుడు ఆనంద్ బుర్మన్.. తొలిసారి ఓటరు. మృతదేహాన్ని పతంతులి పోలింగ్ బూత్ 85 నుంచి బయటకు తీసుకువచ్చామని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. పోలింగ్ బూత్ బయట కార్యకర్తలు బాంబులు విసురుకున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ జరిపాయని వెల్లడించారు.
''కూచ్బెహార్ జిల్లా సీతల్కుచిలో పోలింగ్ బూత్ ముందే ఓ వ్యక్తిని కాల్చి చంపారని మాకు సమాచారం వచ్చింది. పూర్తి సమాచారం తెలుసుకోవడానికి రిటర్నింగ్ అధికారిని పిలిచాము.''
-ఎన్నికల అధికారి