కర్ణాటక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమనే వరించిందని భాజపా, కాంగ్రెస్ చెప్పుకొచ్చాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకుండానే విజయాన్ని ప్రకటించుకున్నాయి.
ఎన్నికల్లో భాజపా గరిష్ఠ స్థానాలను కైవసం చేసుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ పేర్కొన్నారు. పార్టీ వ్యూహాలే ఈ విజయానికి కారణమని చెప్పుకొచ్చారు.
"ప్రజలు అభివృద్ధికి మద్దతిచ్చి.. భాజపా నేతలను గెలిపించారు. గ్రామ స్వరాజ్ వంటి పథకాలకు ఆకర్షితులయ్యారు. బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయి."
-నలిన్ కుమార్ కటీల్, కర్ణాటక భాజపా అధ్యక్షుడు
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వ్యక్తులే మెజార్టీ స్థానాల్లో గెలిచారని ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. భాజపాకు రైతులు గుణపాఠం చెప్పారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ రైతుల పక్షానే నిలబడిందని, ఈ నమ్మకం ప్రజల్లో ఎప్పటినుంచో ఉందని అన్నారు. విజయాల పరంపర కొనసాగుతూ వస్తోందని వ్యాఖ్యానించారు.
"గ్రామీణ భారత ప్రజలు భాజపా అమలు చేస్తున్న విధానాల పట్ల విసుగు చెందారు. సాగు చట్టాలకు రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. భాజపాకు బుద్ధి చెప్పేందుకు వారికి గ్రామ పంచాయతీ ఎన్నికల రూపంలో మంచి అవకాశం లభించింది. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి."