దేశానికి రైతే రాజు, వెన్నుముక అని నానుడి వింటుంటాం. అయితే ప్రస్తుత కాలంలో యువరైతులకు పెళ్లి కావాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తోంది. వధువుల తల్లిదండ్రులు రైతులకు తమ అమ్మాయిలను ఇచ్చి వివాహం చేసేందుకు ముందుకు రావడం లేదు. అలాంటి పరిస్థితిని నివారించేందుకు కర్ణాటక మండ్య జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్థులు.. వధూవరుల సమ్మేళనాన్ని నిర్వహించారు. మండ్య జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు.
ఈ పెళ్లిచూపుల సమ్నేళనానికి 250 మంది అమ్మాయిలు రాగా.. వారిని చూసుకోవడానికి 11,775 మంది యువకులు తరలివచ్చారు. వీరందరూ యువరైతులు, రైతు కుటుంబానికి చెందినవారే కావడం విశేషం. ఒక్కలిగ సంఘం కన్వెన్షన్లో దాదాపు 12,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. పెళ్లిచూపులకు వచ్చిన యువకుల క్యూలైన్ చూసి అందరూ షాక్ అయ్యారు.