దేశంలో ప్రజల మాటే అత్యున్నతమైనదని నొక్కి చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi news). ఆ గొంతుక.. ప్రస్తుత నిరంకుశ వ్యవస్థలో నలిగిపోతోందని, దేశం గొంతుక అణిచివేతకు గురవటం విషాదమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక మాద్యమంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు రాహుల్.
ఈ సందర్భంగా.. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన పర్యటనలు, ప్రజలను కలిసిన సందర్భాలపై మాట్లాడారు రాహుల్.
"నా తండ్రితో కలిసి పర్యటనలకు వెళ్లిన సందర్భాలను గుర్తు చేసుకుంటే.. ఆ పర్యటనలకు మూలం ప్రజలను కలవటం ఒక్కటే కాదు. నిజానికి వారి అవసరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. ప్రజలు చెప్పేది వినేందుకు రాజీవ్ గాంధీ పర్యటనలు ఉండేవి. ఇక్కడి ప్రజల్లో అద్బుత శక్తి ఉంది. కానీ, ప్రజలు మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మాట్లాడేందుకు అవకాశం, అనుమతి లభించడం లేదు. ప్రజల స్వరం నిరంకుశ వ్యవస్థ, గుత్తాధిపత్య మూలాలతో అణిచివేతకు గురవుతోంది. దేశ ప్రజల గొంతుకను దేవుడిగా భావించాలి. దానికి మించింది ఏమీ లేదు. ఇది ఒక్కరి మాట కాదు. కోట్లాది మంది ఒక్క గొంతుకగా చేప్పే మాట. వారు మాట్లాడితే గొప్ప శక్తి ఉంటుంది."