Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లాలో 14 మంది ప్రయాణికుల్ని బలిగొన్న రైలు ప్రమాదానికి.. స్పష్టమైన కారణాల కోసం రైల్వేయంత్రాంగం దృష్టిసారించింది. ప్రమాదం జరిగిన.. 19 గంటల్లోనే ట్రాక్‌ను పునరుద్ధరించిన రైల్వే అధికారులు.. అంతే వేగంతో ప్రమాద కారణాలు నిగ్గుతేల్చేపనిలో పడ్డారు. ఆటోమెటిక్ సిగ్నల్ విధానంలో రెండు చోట్ల లోపాలు ఉన్నాయని కొందరు చెప్తుంటే.. రాయగడ ప్యాసింజర్ లోకో పైలెట్ హెచ్చరికలు పాటించకుండా వేగంగా వెళ్లడమే.. కారణమై ఉంటుందనేది (Vizianagaram Train Accident Causes) మరో వాదన.
రైలు మార్గాల్లో అన్నిచోట్ల అబ్జల్యూట్ బ్లాక్ సిస్టమ్-ABS ఉంటుంది. అంటే ఒక రైలు తర్వాతి స్టేషన్‌కు చేరుకున్నాకే.. వెనుక స్టేషన్‌లో మరో రైలు కదిలేందుకు అనుమతిస్తారు. మన రాష్ట్రంలోని రైల్వే మార్గాల్లో అత్యధికంగా.. ఇదే విధానం ఇప్పటికీ ఉంది. ఇందులో ఒక భాగం ఇంటర్మీడియట్ బ్లాక్ విధానం. దీనిలో.. 2 స్టేషన్ల మధ్య ఒక చోట సిగ్నల్ పోస్ట్ ఉంటుంది. అంటే ఓ స్టేషన్‌లో బయలుదేరిన రైలు మధ్యలో ఉన్న సిగ్నల్ పోస్ట్ దాటిన తర్వాత.. వెనుక స్టేషన్ నుంచి మరొక రైలు కదిలేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కొంతకాలంగా పలు మార్గాల్లో.. ఆటోమెటిక్ బ్లాక్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఇందులో ఒక స్టేషన్‌కు తర్వాత స్టేషన్‌కు మధ్య ఉండే దూరంలో సగటున ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరానికి ఒకటి చొప్పున.. ఆటోమెటిక్ సిగ్నల్ పోస్ట్ ఉంటుంది.
Andhra Pradesh Train Accident: రైలు ప్రమాదం.. 19 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ.. కొనసాగుతున్న రాకపోకలు
రైలు ఒక సిగ్నల్ పోస్ట్ దాటి వెళ్లాక.. వెనుక సిగ్నల్ పోస్ట్ వద్ద మరొక రైలు బయలుదేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ప్రస్తుతం.. రైలు ప్రమాదం జరిగిన కొత్తవలస-విజయనగరం మార్గంలోనూ.. ఆటోమెటిక్ సిగ్నల్ విధానమే ఉంది. కృష్ణా కెనాల్ స్టేషన్ నుంచి విజయవాడ మీదుగా ముస్తాబాద్ స్టేషన్ వరకూ.. కేవలం 18 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఆటోమెటిక్ సిగ్నల్ విధానం అందుబాటులో ఉంది. మిగిలిన 110 స్టేషన్ల పరిధిలో.. దాదాపు 60 స్టేషన్లలో A.B.S. ఉంది. మరో 50 స్టేషన్లకు మధ్య దూరం అధికంగా ఉండటంతో ఇంటర్మీడియట్ బ్లాక్ సిస్టమ్ ఉంది.
పసుపు లైట్ సిగ్నల్ ఉంటే..:సాధారణంగా.. రైళ్ల రాకపోకలకు 4 రకాల సిగ్నల్స్ ద్వారా లోకో పైలెట్‌కు సమాచారం చేరుతుంటుంది. పసుపు లైట్ సిగ్నల్ ఉంటే అప్రమత్తంగా ఉండాలని.. తర్వాత సిగ్నల్‌లో రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌లో ఏదైనా ఉండొచ్చని అప్రమత్త సందేశం ఇస్తారు. ఇలాంటి సమయంలో.. రైలు గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి. 2 పసుపు లైట్లతో సిగ్నల్ ఉంటే.. కచ్చితంగా ప్రమాదం అని, తర్వాత సిగ్నల్ పోస్టులో రెడ్ సిగ్నల్ ఉంటుందని హెచ్చరిక.! ఇలా ఉంటే.. లోకో పైలెట్ రైలు వేగాన్ని పూర్తిగా నియంత్రించాలి.