విశాఖలో ఎంపీ కుటుంబసభ్యులు కిడ్నాప్ MP MVV Family Members Kidnap Updates: విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ MVV సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్.. నగరంలో కలకలం రేగింది. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఆడిటర్ స్పందించడం లేదని.. తనకేదో అనుమానంగా ఉందని ఎంపీ ఫిర్యాదు చేసినట్లు.. సీపీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. ఎంపీ ఫిర్యాదుతో ఆడిటర్‌కు ఫోన్ చేయగా.. తాను శ్రీకాకుళంలో ఉన్నట్లు చెప్పారని.. కానీ లోకేషన్ మాత్రం విశాఖలోనే చూపిస్తోందని సీపీ వెల్లడించారు. దీంతో కిడ్నాప్ నిజమేనని తేలిందన్నారు. అయితే.. పోలీసులకు సమాచారం అందిందని తెలుసుకున్న కిడ్నాపర్లు ఎంపీ సతీమణి జ్యోతి, కుమారుడు శరత్‌చంద్ర, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును కారులో తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను వెంబడించి పట్టుకున్నామని సీపీ వివరించారు.
13వ తేదీన ఎంపీ ఇంట్లోకి నిందితులు ప్రవేశించారన్న సీపీ.. M.V.V. కుమారుడు శరత్‌చంద్రని బెదిరించడంతో పాటు గాయపరిచారని వెల్లడించారు. ఆ తర్వాత అతనితోనే ఫోన్ చేయించి తల్లి జ్యోతి, ఆ తర్వాత ఆడిటర్ వెంకటేశ్వరరావును పిలిపించారని.. ముగ్గురిని ఇంట్లోనే బంధించారని వెల్లడించారు. ఎంపీ సతీమణి నుంచి బంగారు ఆభరణాలు, ఆడిటర్ నుంచి నగదును దోచుకున్నారని సీపీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారన్న సీపీ.. ప్రధాన సూత్రధారి కోలా వెంకట హేమంత్‌కుమార్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే రెండు రోజులుగా నిందితులు ఎంపీ ఇంట్లోనే ఉన్నా.. బయటికి ఎందుకు తెలియలేదని విలేకరులు సీపీని ప్రశ్నించారు. ఎంపీ ఇంట్లో సీసీ కెమెరాలు లేవన్న సీపీ.. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందని చెప్పారు. ఎలాంటి భూ వివాదానికి సంబంధం లేదని..సెటిల్‌మెంట్ విషయం కాదని స్పష్టం చేశారు.
డబ్బు కోసమే కిడ్నాప్: డబ్బు కోసమే తన కుటుంబసభ్యుల్ని, ఆడిటర్‌ను కిడ్నాప్ చేశారని.. ఎంపీ MVV సత్యనారాయణ చెప్పారు. వ్యాపారంలో తనకెవరూ శత్రువులు లేరని చెప్పారు. మొన్న రుషికొండలో తన కుమారుడిని కిడ్నాప్ చేశారని.. రౌడీషీటర్ హేమంత్ ఐదారుగురితో కలిసి కిడ్నాప్ చేశారని తెలిపారు. తన కుమారుడిని కిడ్నాప్ చేశాక.. తన భార్యను కూడా పిలిపించారని.. ఆ తర్వాత జీవీని పిలిపించి డబ్బులు వసూలు చేశారన్నారు. నిన్న జీవీ కనబడకపోతే అనుమానంతో పోలీసులకు తెలిపానని.. పోలీసులకు తెలిపితే జీవీ ఫోన్ ట్రాకింగ్ పెట్టారని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నట్లు తెలిపినా ఫోన్ సిగ్నల్ రుషికొండలో ఉన్నట్లు తెలిసిందని అన్నారు. నిందితులు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారన్నారు. తనకు గన్‌మెన్ ఉన్నాడని.. తన కుటుంబానికి ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు. పోలీసులు చక్కగా పని చేసి ప్రాణనష్టం లేకుండా చేశారని.. నిందితుడు హేమంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఎంపీ కుటుంబాన్ని బంధించిన నిందితులను ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. స్టేషన్ వైపు ఎవరినీ రానివ్వకుండా ముగ్గురు డీసీపీల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.