తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viveka case: వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపై ఛార్జిషీట్.. ఎనిమిదో నిందితుడిగా పేర్కొన్న సీబీఐ - Vivekananda Reddy murder case updates

Viveka murder case
వివేకా హత్య కేసు

By

Published : Jun 30, 2023, 11:45 AM IST

Updated : Jun 30, 2023, 8:21 PM IST

11:40 June 30

ఎంవీ కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాష్‌ను అనుమానితులుగా చేర్చిన సీబీఐ

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపై ఛార్జిషీట్

Vivekananda Reddy murder case latest updates: వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా పేర్కొన్న సీబీఐ... వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో ఆయన ప్రమేయాన్ని ఛార్జిషీట్‌లో వివరించినట్లు తెలుస్తోంది. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రనూ అభియోగపత్రంలో పొందుపరిచింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిస్తున్న వేళ... సీబీఐ అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. వివేకా హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. అవినాష్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్‌ రెడ్డి పాత్రను ఇందులో పొందుపరిచింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో సీబీఐ వెల్లడిచింది. అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలను ఛార్జిషీట్‌కు జత పరిచింది. గతంలో సిట్ అరెస్టు చేసిన ఎంవీ కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాష్‌ను అనుమానితులుగా ప్రస్తావించింది. ఈ కేసులో నిందితులు భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ శంకర్ రెడ్డి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

నాలుగేళ్లుగా అనేక మలుపులు: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నాలుగేళ్లుగా అనేక మలుపులు తిరుగుతోంది. మొదట రాష్ట్ర పోలీసులతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తు చేసింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 209 జూన్ 13న కొత్త సిట్ ఏర్పాటైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంకో సిట్‌ను నియమించారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో 2020వ సంవత్సరంలో కేసు సీబీఐకి చేరింది. ఈ కేసులో 2021 అక్టోబరు 26న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిపై సీబీఐ ఛార్జిషీట్ వేసింది.

మరో నిందితుడు డి.శివశంకర్‌రెడ్డిపై 2022 ఫిబ్రవరి 3న అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ-6గా, వైఎస్ భాస్కర్‌రెడ్డిని A-7గా చేర్చింది. ఏప్రిల్ 14వ తేదీన ఉదయ్ కుమార్ రెడ్డిని, 16వ తేదీన భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. వివేకా హత్య కేసును ఏప్రిల్ 30 నాటికే పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆ తర్వాత గడువును జూన్‌ 30 దాకా పొడిగించింది.

ఆ తర్వాతే దర్యాప్తు వేగం పుంజుకుంది: వివేకానందరెడ్డి హత్య కేసు హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పలు సమయాల్లో తెలంగాణ హైకోర్టులో సీబీఐ గట్టిగా వాదించింది. ఒక దశలో అవినాష్ రెడ్డిని నేరుగా అరెస్టు చేసేందుకు కర్నూలుకు కూడా దర్యాప్తు అధికారులు వెళ్లారు. వివేకా హత్య గురించి బాహ్య ప్రపంచానికి తెలియడానికి ముందే అప్పటి ప్రతిపక్ష నేత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం జగన్‌కు తెలుసునని సీబీఐ ప్రస్తావించింది.

జులై 3న సుప్రీంకోర్టులో విచారణ: జగన్‌కు ఎవరు చెప్పారో దర్యాప్తు జరుగుతోందని సీబీఐ పేర్కొంది. ఈ పరిణామాల మధ్యే మే 31న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు, 5 లక్షల రూపాయల పూచీకత్తుతో అవినాష్ రెడ్డికి సీబీఐ బెయిల్ ఇచ్చింది. జూన్‌లో ప్రతీ శనివారం సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Last Updated : Jun 30, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details