Vivekananda Reddy daughter Sunitha: తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా శిక్ష పడాల్సిందేనన్న పట్టుదలతో.. ఆమె చేసిన ఒంటరి పోరాటం అనితర సాధ్యం. వైసీపీ ప్రభుత్వ పెద్దలు కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నించినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లారు వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి. అనేక ప్రతికూల పరిస్థితులకు ఆమె ఒంటరిగానే ఎదురొడ్డారు. ఆమె చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించి, కేసు విచారణ కీలకదశకు చేరుకుంది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ వరకు దారితీసిన పరిణామాల వెనుక.. వివేకా కుమార్తె సునీతారెడ్డి చేసిన అలుపెరగని పోరాటం ఉంది. కోర్టు వెలుపలా, బయట ఒంటరిగానే ఆమె పోరాటం చేశారు. వాస్తవానికి వివేకా హత్య కేసుపై దర్యాప్తునకు అప్పటి తెదేపా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసి.. కడప ఎస్పీ అభిషేక్ మహంతి నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తు కొంత వేగం పుంజుకున్న దశలో.. ఎస్పీ అభిషేక్ మహంతికి ఎదురైన ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం ఎస్పీగా అన్బురాజన్‌ను నియమించారు. సునీత ఆయనను కలవగా.. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి మార్గనిర్దేశమూ లేదని ఆయన తేల్చి చెప్పేశారు. పైగా కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించబోతున్నారన్న ప్రచారమూ జరిగింది.
ఆ తర్వాత కూడా వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్‌కు పదేపదే సునీత విజ్ఞప్తి చేశారు. కానీ జగన్ నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని సునీత వివిధ సందర్భాల్లో వెల్లడించిన విషయాల్ని బట్టి అర్థమవుతోంది. తన తండ్రి హత్య కేసు విషయమై చర్చించేందుకు జగన్‌కు చెప్పి ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేయించాలని విజయమ్మను కోరగా.. ఆమె జగన్‌కు ఫోన్ చేసి ఆ విషయం చెబితే.. ఆయన నవ్వి, గంట కూడా సమయం కేటాయించలేనని చెప్పారని సునీత తెలిపింది. ఆ తర్వాత 2019 అక్టోబరు 6న తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఫ్యామిలీ మీటింగ్ ఖరారైంది.
అనుమానితుల పేర్ల జాబితాను జగన్, అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్, సజ్జల రామకృష్ణారెడ్డి సహా అక్కడున్న వారందరికీ అందజేశారు. అందులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుకు బదులు.. తన భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరును చేర్చాలని సలహా ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అలా చెప్పడంతో జగన్‌తో సునీత వాదించారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్‌రెడ్డి వైసీపీ నుంచి భాజపాలోకి వెళ్లిపోతారని, అప్పుడు ఆయనకు ఏమీ కాదని జగన్ చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సునీత అన్నారు. దీంతోపాటు ఈ కేసు సీబీఐకి వెళితే అది తనకు 12వ కేసు అవుతుందని జగన్ అన్నారని ఆమె వెల్లడించారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పైవిధంగా పేర్కొన్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తనకు కళ్లలాంటివారని జగన్ చెప్పినట్లు.. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ మాతో అన్నారని కూడా సునీత పేర్కొన్నారు.