Sunitha petition in Supreme Court :వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. గతనెల 31న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్‌కు ముందస్తు మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీత సవాల్ చేసింది. సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన కుట్రదారుగా ఉన్నారని సునీత తరఫు న్యాయవాది సుప్రీంకు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వం కూడా అవినాష్‌కే మద్దతిస్తోందని కోర్టులో పేర్కొన్నారు. సీబీఐ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని సునీత న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 24 తర్వాత సీబీఐ నాలుగు సార్లు సమన్లు జారీ చేసిందనీ.. అయితే, అవినాష్ ఒక్కసారి కూడా సీబీఐ విచారణకు హాజరుకాలేదని సునీత తరఫున న్యాయవాది సుప్రీం కోర్టుకు వెల్లడిచారు.
Bhaskar Reddy Bail Petition: భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు: మరో వైపు వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు నిరాకరించింది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ... సీబీఐ ఈనెల 5న సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో పలు అంశాలు ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్య కేసులో కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా పేర్కొంది. వాదనలు విన్న సీబీఐ కోర్టు భాస్కర్‌రెడ్డికి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది.
గత వారంలోనే అరెస్టు, విడుదల: వివేకా హత్య కేసులో ఈ నెల 3వ తేదీన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయంఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చిన సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసింది. ఐదు లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని.. అరెస్టు వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన సమయంలోనే అరెస్ట్, విడుదల రెండూ జరిగిపోయాయి. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. ఐతే ఇన్ని రోజులపాటు సీబీఐ, అవినాష్ రెడ్డి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం.