Viveka Letter Case: వివేకా లేఖ.. నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి
16:08 June 07
సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు
CBI Permission to Ninhydrin Test to Viveka Letter: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తులో కీలకంగా భావించే వివేకా రాసిన లేఖపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హత్యాస్థలిలో లభించిన లేఖను సీబీఐ అధికారులు 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్ఎస్ఎల్కు పంపారు. దీన్ని పరిశీలించిన దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్.. ఒత్తిడిలోనే వైఎస్ వివేకా రాసిన లేఖగా తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను సీబీఐ కోరిది. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్ సూచించింది. నిన్‌హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున.. నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరారు. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. సీబీఐ పిటిషన్‌పై నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు, నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇచ్చింది.
సీబీఐ కోర్టులో పిటిషన్: వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఆయన (వివేకానంద )రాసిన లేఖకు నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష జరిపేందుకు అనుమతివ్వాలని గత కొన్ని నెలల క్రితం నాంపల్లి సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు.. తీర్పును ఈరోజు వాయిదా వేసింది. సీబీఐ వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తన (వివేకా) హత్యకు డ్రైవర్ ప్రసాద్ కారణమంటూ.. వివేకా రాసిన లేఖ ఆరోజున హత్య జరిగిన ప్రదేశంలో లభించింది. దాన్ని స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు.. దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్ విభాగానికి పంపించారు. దాన్ని పరిశీలించిన సీఎఫ్‌ఎస్‌ఎల్.. తీవ్రమైన ఒత్తిడిలో ఆ లేఖను రాసినట్టు తేల్చిచెప్పింది. అయితే నిందితులే బలవంతంగా వివేకాతో ఆ లేఖ రాయించినట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించింది. అయితే, ఆ లేఖపై వివేకాతో పాటు ఇంకా ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో.. గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష జరపాలని సీబీఐ భావించింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై సీబీఐ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇచ్చింది.