గుండెపోటుతో అకాల మరణం చెందిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజకుమార్ నేత్ర దానం చేసి ఇప్పటికే నలుగురికి కంటిచూపునిచ్చారు(puneet rajkumar news). కార్నియాతో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పునీత్ కళ్ల స్టెమ్‌సెల్స్‌తో ఇప్పుడు మరింత మందికి చూపునివ్వవచ్చని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు తెలిపారు. కార్నియా, స్టెమ్‌సెల్స్ ద్వారా ఎక్కువ మందికి చూపునిచ్చే ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి అని వారు చెబుతున్నారు.
పునీత్ కళ్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని(puneeth rajkumar eyes), అందుకే మరింత మందికి చూపునివ్వాలని ఈ ఆలోచనతో ముందుకువచ్చినట్లు నారాయణ నేత్రాలయ ఆస్పత్రి తెలిపింది.
" ప్రమాదాల కారణంగా కళ్లలో చీలికలు ఏర్పడటం, కెమికల్ స్ప్రే వల్ల కళ్లు దెబ్బతినడం, ఇతరత్రా కారణాల వల్ల చూపు కోల్పోయిన వారికి స్టెమ్ సెల్స్ ద్వారా తిరిగి చూపు తీసుకురావచ్చు. పునీత్ కళ్ల స్టెమ్ సెల్స్‌తో మరో 5 నుంచి 10 మందికి చూపునివ్వొచ్చు. కనుగుడ్డులో కార్నియా చుట్టూ ఉండే తెల్లటి భాగంలో స్టెమ్‌సెల్స్ ఉంటాయి. పునీత్ స్టెమ్‌సెల్స్‌ను గ్రో స్టెమ్ సెల్స్ అనే ల్యాబ్‌లో సురక్షితంగా ఉంచాం." అని నారాయణ నేత్రాలయ వైద్యుడు డా.భుజంగశెట్టి వివరించారు.