విజిల్‌తో ఆడుకుంటూ.. అనుకోకుండా దాన్ని మింగేశాడు ఓ తొమ్మిదేళ్ల బాలుడు. దీంతో అది నేరుగా వెళ్లి చిన్నారి శ్వాసనాళంలో ఇరుక్కుపోయింది. నెలరోజుల క్రితం ఘటన జరగ్గా.. గురువారం బాలుడి శరీరం నుంచి విజిల్‌ను బయటకు తీశారు వైద్యులు. క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి.. చిన్నారి ప్రాణాలను కాపాడారు. బంగాల్లో ఈ ఘటన జరిగింది.
ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..బిప్లయ్ రాయ్ డార్జీలింగ్ జిల్లాలోని సిలిగుడి సమీపంలో ఉన్న అంబారి ప్రాంతానికి చెందిన వ్యక్తి. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం బిప్లయ్ రాయ్ కుమారుడు వివేక్ రాయ్.. విజిల్‌తో ఆడుకుంటూ దాన్ని మింగేశాడు. అది నేరుగా వెళ్లి బాలుడి వాయునాళంలో ఇరుక్కుపోయింది. బాలుడు ఊపిరి వదిలేటప్పుడు మాత్రం లోపలి నుంచి విజిల్ సౌండ్ వచ్చేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొద్ది రోజుల తరువాత వివేక్ రాయ్‌కు శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అనంతరం పరిస్థితి మరింత విషమించటం వల్ల నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చిన్నారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. దీనికి చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేయాలని బాలుడి కుటుంబ సభ్యులకు సూచించారు. ఆపరేషన్‌కు బాలుడి కుటుంబ సభ్యుల సమ్మతి తెలపడం వల్ల వెంటనే చిన్నారికి అత్యవసర చికిత్సను ప్రారంభించారు వైద్యులు. శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన విజిల్‌ను తొలగించేందుకు.. ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. అనస్థీషియా, సర్జన్, ఈఎన్‌టీ విభాగానికి చెందిన వైద్యులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
బాలుడి శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన విజిల్ వైద్యులు రాధేశ్యామ్ మహతో, ధృపద్ రాయ్, గౌతమ్ దాస్, సందీప్ ఘోష్, తుహిన్ షాస్మల్, అజితవ సర్కార్, శుభమ్ గుప్తా, ఎస్కే అజరుద్దీన్, సందీప్ మోండల్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అనస్థీషియా విభాగం నుంచి డాక్టర్లు సుబ్రత మోండల్, వాసిం.. సర్జరీకి సహకరించారు. బ్రోంకోస్కోపీ ఫోర్సెప్స్ పద్ధతిని ఉపయోగించి బాలుడికి సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి శ్వాసనాళం నుంచి విజిల్ విజయవంతంగా తొలగించినట్లు వారు వెల్లడించారు. బాలుడు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. విజిల్ ఇంకొన్ని రోజుల పాటు శరీరంలో అలాగే ఉంటే ఇన్ఫెక్షన్కు దారి తీసేదని వైద్యులు వివరించారు. కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు చిన్నారి తండ్రి.. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడు తిరిగి మామూలు స్థితికి రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంపై వైద్యులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.