Visakha Steel Expression of Interest : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వర్కింగ్ కేపిటల్, ముడి సరుకు భాగస్వామ్యం కోసం... ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) బిడ్ల దాఖలు గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ, అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి నుంచి గానీ ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. మొత్తం 29 సంస్థలు ఈవోఐ దాఖలు చేసినట్టు సమాచారం. ఎన్ఎండీసీ లాంటి సంస్థలు ఏవీ ఈవోఐ దాఖలు చేయలేదని కార్మిక సంఘ నేతలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వర్కింగ్ కేపిటల్, ముడి సరకు సరఫరా కోసం స్టీల్ వ్యాపారంలో గానీ.. స్టీల్ తయారీకి వినియోగించే ముడి సరకు వ్యాపారంలో ఉన్న వారి నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ మార్చి 27న విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఈ నెల 15 వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీన్ని మరో ఐదు రోజులు పొడిగిచారు. బిడ్లను నేరుగా గానీ... మెయిల్ ద్వారా గానీ పంపేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసేలోపు... దాదాపు ఏడు విదేశీ సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేసినట్లు కార్మిక నేత ఆయోధ్యరామ్ వెల్లడించారు.
విదేశీ సంస్థలు సైతం.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈవోఐ కోసం దరఖాస్తు గడువు ఈ మధ్యాహ్నంతో ముగిసింది. కాగా, అందరూ ఊహించినట్లుగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ, అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి నుంచి గానీ ఈవోఐ దాఖలు కాలేదు. మొత్తం 29 సంస్థలు ఈవోఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) దాఖలు చేసినట్టు సమాచారం. ఎన్ఎండీసీ లాంటి సంస్థలు ఏవీ ఈవోఐ దాఖలు చేయలేదని కార్మిక సంఘ నేతలు వెల్లడించారు. ఇందులో దాదాపు ఏడు విదేశీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని కార్మిక నేత ఆయోధ్యరామ్ వివరించారు. విదేశీ సంస్థలు మన స్టీల్ ని కొనుగోలు చేసుకుని వెళ్తారని, మన బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బలేకుండా మనకు కావాల్సిన నిధులు సమకూర్చి.. ఆ మేరకు స్టీల్ వారికి సరఫరా చేసే ఒప్పందం వల్ల విశాఖ ఉక్కుకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్టీల్ వ్యాపారంలో ఉన్న జేఎస్డబ్ల్యూ, జేఎస్పీఎల్ వంటివి విశాఖ స్టీల్ కి ప్రధాన పోటీ దారులని, వాటిలో ఎటువంటి ఒప్పంద మైనా విశాఖ స్టీల్ బ్రాండ్ ఇమేజ్ కే నష్టమని అయోధ్యరామ్ అభిప్రాపడ్డారు.