COP Gives CPR to Revive Snake Video Viral :మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు లేదా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేరే వ్యక్తులు నోటి ద్వారా శ్వాసను అందించి ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. అలాగే.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న వారికి సీపీఆర్ చేసి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సీపీఆర్(CPR)ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది..? ఏవిధంగా అయితే మనిషి నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతామో.. అచ్చం అలాగే పాము నోట్లో నోరు పెట్టి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదూ..! కానీ మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ పోలీస్ అధికారి మాత్రం చనిపోయిందనుకున్న పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు పోశాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Snake CPR Video Viral : మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని సేమరి హరిచంద్ పోలీస్ పోస్ట్ పరిధిలో చోటుచేసుకున్నదీ ఘటన. అక్కడ స్థానికంగా ఉన్న రెసిడెన్షియల్ కాలనీలోని ఓ ఇంటి వద్దకు ఓ విషరహిత సర్పం వచ్చింది. వెంటనే దానిని చూసి భయపడిపోయిన స్థానికులు దానిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ పాము ఓ పైపులోకి దూరిపోయింది. దాంతో అక్కడివారు ఆ పామును చంపేందుకు పురుగుల మందును ఆ పైపులోకి పోశారు. ఆ మందు ప్రభావంతో పాము అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ఈ విషయం తెలుసుకున్న హరిచంద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి వచ్చాడు. ఆ పామును పరిశీలించి, దాన్ని పక్కకు తీసుకెళ్లి నీళ్లు పోసి శుభ్రం చేశాడు. ఆ తర్వాత సర్పాన్ని బతికించేందుకు సీపీఆర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో చాలా సార్లు పాము అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా.. ఆపకుండా నోట్లోకి గాలి ఊదుతూ సీపీఆర్ చేశాడు. దాంతో కాసేపటికీ ఆ సర్పం స్పృహలోకి వచ్చింది. అనంతరం దానిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.