రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని బాయ్తులో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. వారి మధ్య ఉన్న భూవివాదం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళను జేసీబీతో తొక్కించేందుకు యత్నించారు.
ఈ ఘటనలో మహిళలు కూడా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్కాగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ భూమి ఎవరికి సొంతం అనే విషయంపై గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అధికారులు వివరించారు. చివరకు ఆ భూమిలో నిర్మాణం చేసేందుకు ఓ వర్గం వెళ్లగా.. వారిని అడ్డుకునేందుకు మరో వర్గం ప్రయత్నించిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.