అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో స్పష్టత లేని ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 'ఎంత చెప్పినా నువ్వు అల్లరి చేస్తూనే ఉన్నావ్. అల్లరి చేయనంటూనే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్' అంటూ ఉపాధ్యాయురాలు ఆ బాల విద్యార్థి తీరు పట్ల నొచ్చుకుంటారు. 'ఇకపై నీతో మాట్లాడబోను' అని కూడా ఆమె పేర్కొంటారు.
అయితే, దీనికి ఆ చిన్నారి స్పందిస్తూ.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయబోనంటూ ఆ అలిగిన టీచర్‌ను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఇకపై చేయను.. నిజంగా చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దుముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్ సంతోషిస్తుంది. అయితే ముద్దుపెట్టుకోమని అడగటంతో ఆ టీచర్ రెండు చెంపలపైనా ఆ చిన్నోడు ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆదరిస్తుండటం వల్ల ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 3.32లక్షల మంది వీక్షించారు. 18వేల మంది లైక్ చేశారు. 'వీడియో ఎంతో ముద్దుగా ఉంది', 'మా పాఠశాల రోజుల్లో ఇలాంటి టీచర్లు ఎందుకు లేరు' అంటూ నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.