Vinayaka Chaviti 2023 Sep 18th or 19th Full Details ?: హిందూ పండుగల సీజన్ కొనసాగుతోంది. రాఖీ, కృష్ణ జన్మాష్టమి అయిపోగా.. ఇప్పుడు అత్యంత వైభవంగా జరుపుకునే గణపతి పండుగ(Vinayaka Chavithi Date) వచ్చేస్తోంది. ఈ ఉత్సవాల కోసం భక్తులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే.. వినాయక చవితిని ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో మాత్రం చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. మరి ఆ లంబోదరుడి పూజను ఎప్పుడు జరుపుకోవాలి..? విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్టించాలి..? ఆ శుభ ముహుర్తం ఎప్పుడు..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
'వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా.. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా'.. హిందువుల ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. నవరాత్రులూ (9 రోజుల పాటు) జరుపుకునే ఈ ఉత్సవాలను.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే.. గణపతి విగ్రహాల ఏర్పాటు కోసం యువత మండపాలను రెడీ చేస్తున్నారు.
తెలుగు వారి ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగిన మొదట పూజ ఆ విఘ్నేశ్వరుడుకే చెందుతుంది. తాము చేసే ఏ పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు కలుగకూడదని.. ఆ ఏకదంతుడికి పూజ చేస్తారు. ఎందుకంటే ఆయన విఘ్నాలకు అధిపతి కాబట్టి. అందుకే.. ఆ గణపతిని విఘ్నాధిపతి అని కూడా పిలుస్తారు. భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని పురాణోక్తి.