సంస్కృత భాష, భారతదేశానికి చెందిన అతి పురాతనమైన భాష. ప్రస్తుతం ఇది అంతరించిపోయే దశలో ఉంది. ప్రాచీన కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ భాష పూర్తిగా మరుగున పడిపోయింది. ఇలాంటి తరుణంలోనే అసోంలోని ఓ గ్రామ ప్రజలు సంస్కృతానికి ఊపిరి పోస్తున్నారు. కరీంగంజ్ జిల్లా, రాతబరి నియోజకవర్గం పటియాల గ్రామస్థులందరూ సంస్కృత భాషను మాట్లాడుతున్నారు. దీంతో ఆ ఊరు సంస్కృత గ్రామంగా మారిపోయింది.
2015 నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సంస్కృత భాషను మాట్లాడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో మొత్తం 60 కుంటుంబాలు ఉండగా.. సుమారు 300 మంది నివసిస్తున్నారు. వారంతా దేశ పురాతన భాషను మాట్లాడుతూ దానికి పునరుజ్జీవం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ భాష అంతరించిపోయే దశలో ఉందని, దాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. అందుకే ఈ భాషను ఊరంతా మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలు సైతం మాట్లాడేలా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.