ఈగలతో ఆ ఊరి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈగల పేరు చెబితేనే ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. వాటి భయానికి గ్రామస్థులంతా ఊరు వదిలి వెళుతున్నారు. ఈగలే కదా వీటికే ఎందుకు భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఏవో కొన్ని ఈగలైతే సర్దుకోవచ్చు. ఇక్కడ ఈగలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి.
నిద్రపోవడానికి కూడా సమయం ఇవ్వట్లేదు. కాస్త కునుకు తీస్తే చాలు కాటు వేస్తున్నాయి. ఓ ముద్ద తిందామంటే చాలు.. అన్నం చుట్టూ మూగిపోతున్నాయి. దీంతో ఈగల బాధకు ఊరంతా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈగల కారణంగా ఆ ఊరు వారికి పెళ్లిళ్లు సైతం కావట్లేదు. దీంతో గ్రామ ప్రజలంతా ఈగల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మా ఊర్లో ఈగల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఊరు పక్కన పౌల్ట్రీ ఫారం ప్రారంభించినప్పటి నుంచే ఈ సమస్య వచ్చింది. దీంతో మాకెవ్వరికి పెళ్లి కావట్లేదు. ఈగల కారణంగా నా పెళ్లి రెండు సార్లు ఆగిపోయింది.
-అజయ్ వర్మ, గ్రామ యువకుడు
ఉత్తర్ప్రదేశ్ హర్డోయ్ జిల్లాలో అహిరోరి బ్లాక్లో పది గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలంతా ఈగలతో నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామంలో చాలా మందికి పెళ్లి వయస్సు వచ్చిందని, ఈగల కారణంగా వారెవ్వరికి పెళ్లిళ్లు కావట్లేదని వాపోతున్నారు. గత ఏడు సంవత్సరాల్లో కేవలం నలుగురు అమ్మాయిలు, ముగ్గులు అబ్బాయిలకు మాత్రమే పెళ్లిళ్లు జరిగాయని వారు చెబుతున్నారు. ఈగల బాధ భరించలేక చాలా మంది మహిళలు ఇళ్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయారని తెలిపారు. తమ ఊర్లోకి రావాలంటేనే చుట్టు గ్రామాల వారు భయపడుతున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.
ఈగలతో అసలు పడలేకపోతున్నాం. తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. అందుకే ఊరు వదిలి వెళ్లిపోతున్నాం. 12 ఏళ్ల క్రితం నాకు పెళ్లి అయ్యింది. మూడేళ్లుగా ఈగల సమస్య మొదలైంది.
-పూనం, గ్రామ మహిళ
2014లో ఆ ప్రాంతంలో ఒక పౌల్ట్రీ ఫారం నిర్మించారు. 2017లో అక్కడ గుడ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. రోజుకు ఒక లక్షన్నర దాకా గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. అయితే పౌల్ట్రీ ఫారం కారణంగానే తమ ఊర్లోకి ఈగలు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఫారం ప్రారంభంలో బాగానే ఉండేదని, తరువాత కొన్ని రోజులకు కాలుష్యం విపరీతంగా పెరిగి, ఈగల సమస్య వచ్చిందని వారు చెబుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.