ప్రియురాలిని చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాగా భావించి గ్రామస్థులు దాడి చేశారు. ఆ యువకుడి కారును స్థానికులు తగలబెట్టారు. యువకుడిని, అతని స్నేహితుడిని చితకబదారు. చిన్నిపిల్లల్ని ఎత్తుకుపోయే వారిగా భావించి.. వెంటపడి మరి దాడి చేశారు. దీంతో ఆ యువకులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితులిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలో ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగల్‌కోటె జిల్లాలో ఘటన జరిగింది. రాహుల్, కిరణ్ అనే ఇద్దరు యువకులు.. తమ స్నేహితురాలిని చూసేందుకు ముధోల్ తాలూకాలోని కడ్ బుండాని గ్రామానికి కారులో వెళ్లారు. రెండు మూడు సార్లు ఆ ఊరి చుట్టే తిరిగారు. అనంతరం గ్రామంలోని ఓ పాన్‌షాప్ వద్ద ఆగి.. సిగరెట్ వెలిగించారు. యువకుల ప్రవర్తనపై ఆ ఊరి ప్రజలకు అనుమానం కలిగింది. వెంటనే వారిద్దరిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దానికి భయపడిపోయిన యువకులు.. కారెక్కి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వారిపై గ్రామస్థులకు అనుమానం మరింత పెరిగింది. వారిని కచ్చితంగా పిల్లల్ని ఎత్తుకెళ్లేవారని భావించిన గ్రామస్థులు.. పక్క ఊరైన ఖజ్జిదోని గ్రామస్థులకు సమాచారం అందించారు. యువకులను పట్టుకోమని సూచించారు.
వెంటనే అప్రమత్తమైన ఖజ్జిదోని గ్రామస్థులు.. భారీ ఎత్తున గూమిగూడారు. కారును అడ్డగించి యువకులను పట్టుకున్నారు. వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం కారును తగలబెట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న కలదగి పోలీసులు.. వెంటనే ఖజ్జిదోని గ్రామానికి చేరుకున్నారు. తీవ్ర గాయలతో ఉన్న యువకులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. బాధితులిద్దరు బాగల్‌కోటె జిల్లాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు.
భార్యభర్తల కిడ్నాప్
కేరళలోని కోజికోడ్ జిల్లాలో భార్యభర్తలను కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మొహనికి ముసుగు ధరించిన నలుగురు దుండగులు.. కారులో బలవంతంగా వారిని ఎక్కించుకుని వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక మహిళను విడిచిపెట్టారు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. భర్త కిడ్నాప్ గురించి వారికి ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షఫీ, సానియా అనే దంపతులను.. దుండగులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరిగింది. షఫీ విదేశాల్లో వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు విషయంలో వివాదం కారణంగానే షఫీని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. "నా భర్తను దుండగులు కిడ్నాప్ చేస్తుండగా నేను అడ్డుపడ్డాను. దీంతో నన్ను కూడా బలవంతంగా కారులోకి ఎక్కించారు. కొద్ది దూరం వెళ్లాక నన్ను విడిచిపెట్టారు" అని సానియా తెలిపింది. ఘటనలో సానియాకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.