Village name change in Delhi: దక్షిణ దిల్లీలోని మహ్మద్పుర్ గ్రామం పేరును మాధవపురంగా మార్చినట్లు భాజపా నేతలు బుధవారం ప్రకటించారు. బానిసత్వపు గుర్తులు తమతో ఉండకూడదని గ్రామస్థులు కోరుకుంటున్నారని, అందుకే ఇలా చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా మాధవపురంగా మార్చిన గ్రామ నామఫలకం వద్ద పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు దిల్లీ భాజపా అధ్యక్షుడు అదేశ్ గుప్తా. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇటువంటి విషయాలన్నింటికి దిల్లీకి 'స్టేట్ నేమింగ్ అథారిటీ' ఉందని, అలాంటి ప్రతిపాదనలు వస్తే.. దానిని సమీక్షించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే గ్రామానికి భాజపా నేతృత్వంలో పేరు మార్చటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"పేరు మార్చాలన్న ప్రతిపాదనకు మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపిన క్రమంలో.. మాధవపురంగా పేరు మార్చే ప్రక్రియ ఈ రోజు పూర్తయింది. ఇప్పటి నుంచి ఈ గ్రామం పేరు మహ్మద్పుర్ కాదు మాధవపురం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న క్రమంలో బానిసత్వానికి సంబంధించిన గుర్తులు తమతో ఉండాలని దిల్లీ వాసులు కోరుకోవటం లేదు. భాజపా కౌన్సిలర్ ప్రతిపాదనను స్థానికులు, భాజపా కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతిపాదనకు దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. మాధవపురంగా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపి.. గత ఏడాది డిసెంబర్లో దిల్లీ ప్రభుత్వానికి పంపించగా.. ఆరు నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు."
- అదేశ్ గుప్తా, దిల్లీ భాజపా అధ్యక్షుడు.