Vikas Swami Yoga : అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించారు. వారి నైపుణ్యంతో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలకపై తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కానీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారే ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌కు చెందిన తండ్రీకొడుకులు.
మేరఠ్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నావాల్ గ్రామానికి చెందిన వికాస్ స్వామి (38)కి ఇద్దరు కుమారులు. వికాస్‌కు 2010లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల మంచం పట్టాడు. వైద్యులు కూడా ఏమీ చేయలేని చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలో యోగా సాధన చేయమని సన్నిహితుడు ఒకరు సలహా ఇచ్చారు. అనంతరం ఇంట్లోనే యోగా సాధన ప్రారంభించాడు వికాస్. అయితే కేవలం యోగానే కాకుండా విభిన్నంగా ఏమైనా చేయాలనుకున్నాడు. అలా పళ్లతో బరువులు ఎత్తడం సాధన చేశాడు. కొద్ది కాలంలోనే పళ్లతో బరువులు ఎత్తడంలో ప్రావీణ్యం సంపాదించాడు.
2021లో వికాస్ స్వామి తన పళ్లతో 80 కిలోల బరువును ఎత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యోగా ప్రపంచ రికార్డు సాధించాడు. 'ఇండియాస్ గాట్ టాలెంట్' అనే టీవీ షోలో అద్భుత ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా తన పేరును లిఖించుకున్నాడు. రికార్డులతో పాటు పలు పతకాలను అందుకున్నాడు. అలా ఈ కళలో మార్పులు చేస్తూ.. తలకిందులుగా చేతులపై నిలబడి పళ్లతో బరువులు ఎత్తడం మొదలుపెట్టాడు.