Vijayawada Engineering Students With CBN : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు నిరసనకు దిగుతారని పోలీసులు వివిధ కళాశాలల్ని ఖాళీ చేయించారు. విద్యార్థులు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వాట్సాప్ ల్లో మెసేజ్ లు పెట్టుకున్నారు. రాష్ట్రంలో తాము ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నామంటే.. అందుకు ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలను ప్రోత్సహించడమేనంటూ విద్యార్థులు తమ అభిప్రాయాలను వాట్సప్‌లో పంచుకున్నారు. ఉన్నత విద్యకోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా స్థానికంగానే చదువుకునే ఏర్పాటుకు సూత్రధారి అయిన చంద్రబాబుకు అంతా మద్దతుగా నిలవాలని సందేశాలు పంపించుకున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు తెలుపుతామంటూ వివిధ కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా పోలీసులు ముందస్తుగా కట్టడి చేశారు.
Police Warns Students: క్రిమినల్ కేసులు తప్పవంటూ హెచ్చరిక.. మధ్యాహ్నం 12గంటల సమయంలో వివిధ కళాశాలల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని బంగారు జీవితాన్ని పాడు చేసుకోవద్దంటూ విద్యార్థులకు పోలీసులు సూచించారు. నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెడతామంటూ పరోక్ష హెచ్చరికలు ఇచ్చారు. 144సెక్షన్, పోలీస్ 30యాక్ట్ అమల్లో ఉన్నందున ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడ వద్దంటూ ఆదేశించారు. పెనమలూరు, గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో కళాశాలల విద్యార్థులకు పోలీసులు నోటీసులు పంపారు. మొబైల్ లో చిత్రీకరిస్తున్న పలువురు విద్యార్థుల ఫోన్లు లాక్కున్న పోలీసులు..ఎక్కువ చేశారంటే వ్యాన్ ఎక్కిస్తామంటూ బెదిరించారని విద్యార్థులు తెలిపారు.
Students Fire on Police: మండిపడిన విద్యార్థులు.. సిద్ధార్థ ఇంజినీరింగ్, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పోలీసులు పెద్దఎత్తున వెళ్లారు. లాఠీ ఛార్జీకి ప్రయోగించే ఇతర వస్తువులతో కవాతు చేసి చదువుల కొలువులో యుద్ద వాతావరణం సృష్టించారు. తామూ ఒకప్పటి విద్యార్థులమే అనే విచక్షణ మరచి తీవ్రవాదుల స్థావరాలను చుట్టుముట్టినట్టు కళాశాలను చుట్టుముట్టడం విస్మయానికి గురిచేసింది. తరగతులు సస్పెండ్ చేయించి బలవంతంగా కళాశాలలకు సెలవు ఇప్పించారు. కళాశాలలో ఎవ్వరూ ఉండకూడదంటూ విద్యార్థుల్ని బలవంతంగా బయటకు పంపారు. తరగతి గదిలో అధ్యాపకులు బోధిస్తుండగానే కనీస మర్యాద పాటించని పోలీసులు... ఇవాళ బోధన లేదు ఏమీలేదు బయటకు పోండంటూ దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు వాపోయారు. తమ ఎదుటే తమ ప్రొఫెసర్ల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం ఎంతో బాధ కలిగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.