తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vijayawada CP on Margadarsi: చిట్‌ వాయిదాలు సరిగా చెల్లించారో, లేదో తేలుస్తాం: సీపీ కాంతి రాణా - Vijayawada CP kanti raana tata on Margadarsi

Vijayawada CP on Margadarsi: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ముష్టి శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా తెలిపారు. నేరపూరిత విశ్వాసఘాతుకం, మోసం, నేరపూరిత కుట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ (5) కింద ఈ కేసు పెట్టామన్నారు.

Vijayawada CP on Margadarsi
Vijayawada CP on Margadarsi

By

Published : Jul 21, 2023, 8:10 AM IST

Vijayawada CP on Margadarsi: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ముష్టి శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా తెలిపారు. నేరపూరిత విశ్వాసఘాతుకం (ఐపీసీ 409), మోసం (ఐపీసీ 420), నేరపూరిత కుట్ర (ఐపీసీ 120బీ)తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ (5) కింద ఈ కేసు పెట్టామన్నారు. ముష్టి శ్రీనివాస్‌ చిట్టీ పాడుకున్నా.. మార్గదర్శి సంస్థ అతనికి డబ్బులు చెల్లించట్లేదన్న ఫిర్యాదుపై లబ్బీపేట బ్రాంచి మేనేజర్‌ బి.శ్రీనివాసరావు, ఆ బ్రాంచిలో పనిచేసే సిబ్బంది, మార్గదర్శి చిట్‌ఫండ్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

గురువారం విజయవాడలో విలేకర్లతో సీపీ మాట్లాడారు. ‘‘ముష్టి శ్రీనివాస్‌ అనే ట్యాక్స్‌ కన్సల్టెంట్‌.. లబ్బీపేట మేనేజర్‌ బి.శ్రీనివాసరావును సంప్రదించి నెలకు రూ.లక్ష చొప్పున చెల్లించేలా 50 వాయిదాలు కలిగిన రూ.50 లక్షల చిట్‌ గ్రూపులో 2021 సెప్టెంబరులో చేరారు. చిట్‌ వేలం సమయంలో పాడుకుంటే ఆస్తి ష్యూరిటీగా తీసుకుని చిట్‌ మొత్తాన్ని మంజూరు చేస్తామని ముష్టి శ్రీనివాస్‌తో మార్గదర్శి మేనేజర్‌ చెప్పారు. దీంతో 2023 ఫిబ్రవరి వరకూ 18 నెలల పాటు క్రమం తప్పకుండా చెల్లించారు. తర్వాత రూ.50 లక్షల చిట్‌ను రూ.30 లక్షలకు పాడుకున్నారు. ఆయన వద్ద ష్యూరిటీ పత్రాలు తీసుకుని నాలుగు నెలలుగా ముష్టి శ్రీనివాస్‌కు డబ్బులు చెల్లించకుండా మార్గదర్శి వారు తిప్పిస్తున్నారు. రకరకాల కారణాలు చెప్పి అతనికి డబ్బులు చెల్లించట్లేదు. ఆయన కట్టిన రూ.19 లక్షలు కూడా ఇవ్వబోమని చెప్పారు. ముష్టి శ్రీనివాస్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. ఈ చిట్‌ గ్రూపులో 50 మందికి బదులు 30 మందే ఉన్నారని, ప్రతి చిట్‌కు ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా నిర్వహించాల్సి ఉన్నా అన్నింటికీ కలిపి ఒకే ఉమ్మడి ఖాతా నిర్వహించి దాని ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదుదారు సేకరించిన సమాచారం ద్వారా తెలిసింది. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఇప్పటికే రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌కు లేఖ రాశాం. వాంగ్మూలాలు కూడా రికార్డు చేశాం. లబ్బీపేట బ్రాంచి మార్గదర్శి మేనేజర్‌ బి.శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని సీపీ వివరించారు.

అలాగే మార్గదర్శి చిట్‌ఫండ్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి చిట్‌ వాయిదాలు సక్రమంగా చెల్లించారో లేదో తదుపరి విచారణలో తేలుస్తామని సీపీ తెలిపారు. ఫిర్యాదుదారు చెప్పిన విషయాలనే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నామన్నారు. ఆయన గురువారం ఫిర్యాదు ఇవ్వగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలిచ్చిన సీపీ.. కొన్నింటికి బదులివ్వకుండా మౌనం వహించారు.

విలేకరి: ఫిర్యాదుదారు యూనియన్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన ఓ ఆస్తినే, హామీగా చూపిస్తే ఆయనకు చిట్‌ డబ్బులు ఎలా ఇస్తారని మార్గదర్శి అంటోంది?

సీపీ:ఈ ప్రశ్నకు ఫిర్యాదుదారే జవాబు చెబుతారు.

విలేకరి:మీరు ఆరోపణలు చేశారు కదా?

సీపీ: బ్రాంచ్‌ మేనేజర్‌ దానికి సెకండ్‌ ఛార్జ్‌ కూడా ఇవ్వొచ్చు. బ్యాంకింగ్‌ పరిభాషలో దీనిని సెకండ్‌ ఛార్జ్‌ అంటారు. రూ.3 కోట్ల పైన విలువైన ఆస్తిని చూపిస్తామని చెప్పిన తర్వాతే ఆయన చిట్‌లో చేరారు. తర్వాత రూ.19 లక్షలు కట్టించుకొని, చిట్‌ పాడిన తర్వాత, దాని తాలూకా పత్రాలన్నీ తీసుకొన్నారు. నాలుగు నెలలుగా తిప్పుతున్నారు.

విలేకరి:ఆయన చూపిన ఆస్తి.. నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ)లో ఉంది. యూనియన్‌ బ్యాంక్‌లో పెట్టినదాన్నే మళ్లీ ఇక్కడా హామీగా చూపించారు. బ్యాంకులో ఎన్‌పీఏ అయినదాన్ని మళ్లీ ఇక్కడ ఎలా హామీగా చూపిస్తారు?

సీపీ:ఆయన మొదట వెళ్లి అడిగినప్పుడు దానిపై చిట్‌ ఎమౌంట్‌ ఇస్తామని చెప్పారు. దాని పత్రాలు కూడా తీసుకున్నారు.

విలేకరి:ఆ డాక్యుమెంట్లు న్యాయవాదికి చూపించి, అది ఎన్‌పీఏ అయిందని గుర్తించాక, చిట్‌లో మిగిలిన సభ్యుల ప్రయోజనాలు పణంగా పెట్టలేరు కదా?

సీపీ:నిజమే. కానీ ఆయనతో నమ్మబలికి, మోసగించి, చిట్‌లో సభ్యునిగా చేర్చుకున్నారు. ఆయన దగ్గర రూ.20 లక్షలు తీసుకున్నారు. ఆ వివరాలు మీరు ఆయన్నే అడగండి చెబుతారు.

విలేకరి:ఆయన సక్రమంగా చెల్లింపులు చేయలేదంటున్నారు. ఇదే విషయం నాలుగైదుసార్లు గుర్తు చేసినా స్పందించలేదంటున్నారు

సీపీ:అది మేం విచారణలో తేలుస్తాం.

విలేకరి: ఇకపై ప్రతి విలేకరుల సమావేశంలో ఇలాగే ఫిర్యాదుదారుతో మాట్లాడిస్తారా?

సీపీ:పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తాం.

ABOUT THE AUTHOR

...view details