Vijayashanthi to Join in Congress : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు కాంగ్రెస్ గూటికి చేరగా.. త్వరలోనే విజయశాంతి ఆ లిస్టులోకి చేరనున్నారు. నేడో, రేపో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. 'విజయశాంతి కాంగ్రెస్‌లోకి వస్తారు. నేడో, రేపో పార్టీలో చేరతారు' అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ గూటికి విజయశాంతి! - నేడో, రేపో చేరిక - బీజేపీ నేత విజయశాంతి తాజా వార్తలు
Published : Nov 11, 2023, 4:25 PM IST
|Updated : Nov 11, 2023, 5:11 PM IST
16:20 November 11
కాంగ్రెస్ గూటికి విజయశాంతి! - నేడో, రేపో చేరిక
గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మల్లు రవి.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. సినీ నటి విజయశాంతి లాంటి వారంతా కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. కంటోన్మెంట్‌లో గద్దర్ కుమార్తె వెన్నెలను గెలిపించడానికి పార్టీ నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 30న జరిగే ఓట్ల యుద్దంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో 85 నుంచి 95 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తర్వాత 3 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, డిసెంబర్ 9న మొదటి కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. తాజాగా వస్తున్న సర్వేలు వార్ వన్ సైడ్ అని.. కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలోనూ ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో ఆమె పార్టీ మారతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమై.. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య, రైతులపై హామీల వర్షం- బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్