తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vijayasai Reddy comments: 'కేంద్రంపై అవిశ్వాస తీర్మానం'.. బీజేపీకి మద్దతుగా వైఎస్సార్సీపీ వి'జై'సాయిరెడ్డి వ్యాఖ్యలు

Vijayasai Reddy comments: అవిశ్వాస తీర్మానం.. మణిపుర్ రగులుతున్న వేళ కేంద్రాన్ని గట్టిగా నిలదీయడానికి ప్రతిపక్షాలు ఎంచుకున్న మార్గమిది. కేంద్రాన్ని గద్దె దించే ఉద్దేశం లేకున్నా.. మణిపుర్ అంశంపై మోదీ పెదవి విప్పాలని, తద్వారా కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాగా, పార్లమెంటులో ఐదో అతి పెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ తాము అవిశ్వాసానికి వ్యతిరేకమని చెప్తోంది. అంతా బాగానే ఉంది కదా అవిశ్వాసం ఎందుకు అన్న.. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వానికి మిగతా విషయాల్లో మద్దతు ఇచ్చినా పార్టీకి ఇబ్బంది లేదు కానీ... మణిపూర్‌ విషయంలో ఇలా బహిరంగ మద్దతు ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ అనుకూలంగా ఉండే కొన్ని సామాజిక వర్గాలు ఈ విషయమై రగిలిపోతున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 26, 2023, 6:30 PM IST

Updated : Jul 26, 2023, 8:12 PM IST

'దేశంలో అంతా సవ్యంగానే జరుగుతోంది.. అవిశ్వాస తీర్మానం పెట్టేంత అవసరం ఏముంది..? బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మేం వ్యతిరేకం' - వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

Vijayasai Reddy comments: మణిపుర్ హింసాకాండపై యావత్ దేశం నివ్వెరపోయింది. ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన తీరుపై భగ్గుమంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.. తాజాగా వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపుర్​లో జరుగుతున్న హింసాకాండపైపార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా ఉభ‌య స‌భ‌ల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మ‌ణిపూర్ దుర్ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌ధాని మోదీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న ప్రతిపక్షాలు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాయి. మ‌ణిపూర్‌లో అస‌లేం జ‌రుగుతోంది.. అంటూ చ‌ర్చకు విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ మాట్లాడాలంటే అవిశ్వాసమే ప్రధాన మార్గమని విపక్షాలు భావిస్తున్నాయి.

మోదీ సర్కార్​పై నేడు అవిశ్వాస తీర్మానం.. 'ఇండియా' ఫ్రంట్​ రెడీ.. ఎవరి బలమెంత?

ఈ మేరకు అవసరమైన పలు మార్గాలను పరిశీలించిన విపక్ష నేతలు.. అవిశ్వాసం ఆయుధాన్ని ప్రయోగించాలని భావించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు అదే అత్యుత్తమ మార్గంగా నిర్ణయించినట్లు విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం సహా తమకు కూడా పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. మణిపుర్‌ హింస అంశంపై చర్చ సహా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాన నోటీసులు స్పీకర్ కార్యాలయానికి అందజేశాయి. ప్రధాన ప్రతిపక్షం.. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్, భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు విడివిడిగా స్పీకర్​ కార్యాలయానికి తీర్మాన నోటీసులు అందజేశారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి స్పీకర్​ ఓం బిర్లా కూడా అనుమతించిన నేపథ్యాన పార్లమెంటులో 31మంది సభ్యులు కలిగి.. ఏదో అతి పెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి. 'దేశంలో అంతా సవ్యంగానే జరుగుతోంది.. అవిశ్వాస తీర్మానం పెట్టేంత అవసరం ఏముంది..? బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మేం వ్యతిరేకం' అని తేల్చిచెప్పారు.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దిల్లీలో తనను ప్రశ్నించిన మీడియాతో ఆయన.. పై విధంగా స్పందించడం చర్చకు దారితీసింది. మ‌ణిపూర్ దుర్ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

అవిశ్వాస తీర్మాన నోటీసులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీలతో చర్చించనున్నారు. అనంతరం చర్చకు తేదీని ప్రకటించనున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన 10 రోజుల్లోగా చర్చకు తేదీని ప్రకటించాలి. అధికార, విపక్ష పార్టీల బలాబలాల ఆధారంగా చర్చకు ​సమయం కేటాయించనుండగా.. ముందుగా అధికార ఎంపీలు మట్లాడాక.. విపక్ష ఎంపీలు ప్రసంగిస్తారు.

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది, విపక్ష కూటమి 'ఇండియా'కు 140 మంది సభ్యుల బలం ఉండగా.. వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ సహా మరో 60 మందికిపైగా వివిధ పార్టీల ఎంపీలు పై రెండు కూటముల్లోనూ లేరు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమే అయినా మణిపుర్‌ అంశంలో చర్చ కోసం అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయనే ప్రజలు భావిస్తున్నారు.

Last Updated : Jul 26, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details