Vijay Kumar Sinha Resigns: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఇటీవల ఏర్పడిన మహాగట్ బంధన్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనే ముందే అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు. తనపై ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ఆవేదన చెందారు. తనపై వచ్చిన ఆరోపణలేవీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. భాజపాకు చెందిన ఆయన విధాన సభను 2 గంటలకు వాయిదా వేసి గందరగోళం నడుమ బయటకు వెళ్లారు. బలపరీక్షకు నేతృత్వం వహించాల్సిందిగా జేడీయూకు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ పేరును సిన్హా సూచించారు.
అంతకుముందు సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అస్పష్టంగా ఉందని, నియమ నిబంధనలు పాటించలేదని తెలిపారు. 'స్పీకర్‌ను అనుమానించి మీరు ఎలాంటి సందేశం పంపుదామని చూస్తున్నారు? ప్రజలే నిర్ణయం తీసుకొంటారు' అని వ్యాఖ్యానించారు. చివరకు రాజీనామా చేసిన అనంతరం హడావుడిగా తీవ్ర భావోద్వేగంతో సభను వీడి బయటకు వెళ్లారు. అదే సమయంలో భాజపాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాషాయ కండువాలు ధరించి 'భారత్ మాతాకీ జై', 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు. అంతకుముందు ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలు విధాన సభ ముందు నిరసనలు చేశారు.
మరోవైపు మహా గట్‌బంధన్ సర్కారు బలపరీక్ష రోజే పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సహా పలువురి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది.
భాజపాతో విడిపోయి ఆర్జేడీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలతో కలిసి జేడీయూకు చెందిన నీతీశ్ కుమార్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ ప్రభుత్వం ఈ నెల 10న కొలువుదీరింది. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. భాజపాకు చెందిన అసెంబ్లీ స్పీకర్ సిన్హా రాజీనామా చేయలేదు. సాధారణంగా ప్రభుత్వం మారితే అంతకుముందు ఎన్నికైన స్పీకర్ రాజీనామా చేస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం.. అసెంబ్లీ సెక్రటేరియట్ రెండు రోజుల సెషన్ షెడ్యూల్‌లో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సూచనల మేరకు మార్పులు చేసింది. పదవిని వీడేందుకు నిరాకరిస్తున్న సిన్హాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఈ మార్పులు జరిగాయి. దీంతో సిన్హా బుధవారం రాజీనామా చేయక తప్పలేదు.