'కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈరోజు రుతు రుమాళ్లు (శానిటరీ నాప్‌కిన్స్) ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ పోతే.. చివరకు కుటుంబ నియంత్రణ మాటకొస్తే కండోమ్స్ కూడా ఉచితంగా అడుగుతారు' అంటూ బిహార్ ఐఏఎస్ అధికారిణి హర్‌జోత్ కౌర్ చెప్పిన సమాధానం విని ఆ విద్యార్థినులు బిత్తరపోయారు.
ఐఏఎస్ అధికారిణి, విద్యార్థుల మధ్య చర్చ ఇదంతా 'సశక్త్ బేటీ, సమృద్ధ్ బిహార్' అనే వర్క్‌షాప్‌లో భాగంగా పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో జరిగింది. పాఠశాల విద్యార్థినులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిహార్ ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్‌జోత్ కౌర్ మాట్లాడుతుండగా.. 'ప్రభుత్వం ఉచితంగా ఎన్నో ఇస్తోంది. 20 - 30 రూపాయల విలువ చేసే రుతు రుమాళ్లు మాకు ఇవ్వలేరా?' అని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మహిళా ఉన్నతాధికారి పై విధంగా స్పందించారు.
సమావేశంలో పాల్గొన్న ఐఏఎస్ అధికారిణి అయితే, విద్యార్థినులు కూడా వెనక్కు తగ్గలేదు. 'ఓట్ల కోసం వచ్చినపుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా?' అని నిలదీశారు. దీంతో హర్‌జోత్ కౌర్ 'ఇది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అయితే ఓట్లు వేయకండి. పాకిస్థాన్‌లా మారిపోండి. డబ్బులు, సేవల కోసమే ఓట్లు వేస్తున్నారా?' అంటూ విద్యార్థులపై మండిపడ్డారు. అనంతరం, ఐఏఎస్ అధికారి తన వ్యాఖ్యలపై విద్యార్థినికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడకూడదని సూచించారు.
మహిళా కమిషన్ సీరియస్!
కాగా, ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. విద్యార్థినితో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐఏఎస్ అధికారిణికి ఆదేశాలు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా రాతపూర్వకంగా స్పందించాలని స్పష్టం చేసింది.