Girl Assaulted In Delhi: దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే తీవ్ర దాడికి పాల్పడ్డాడు. కర్ర, బూటుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనిపై దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
దిల్లీ పశ్చిమ్ విహార్ ప్రాంతంలో వ్యక్తి ఓ బాలికపై దాడికి పాల్పడుతున్న ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బాలికను దొరకబుచ్చుకున్న సదరు వ్యక్తి.. కర్రతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. విడిపించుకోవాలని బాధితురాలు ఎంత ప్రయత్నించినా ఆమెను వదల్లేదు. అనంతరం కాలికి ఉన్న బూటుతో నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ).. డీసీడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. ఆ సీసీ ఫుటేజీని సైతం అందజేసింది. నిందితుడిని డ్రగ్స్ బానిసగా పేర్కొన్న అసోసియేషన్.. ఆ అమ్మాయిని కొందరు బంధించినట్లు తెలిపింది. ఆ బాలిక జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.