Yogi Adityanath Sister Shop : ఓ చిన్న గ్రామంలోని వార్డ్ మెంబర్ కుటుంబ సభ్యులే.. కార్లలో తిరుగుతూ ఆడంబరాలు ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో.. దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి సోదరైనా సాధారణంగా జీవిస్తున్నారు. ఆడంబర జీవితాన్ని కాకుండా ఓ చిన్న దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ ఎవరామె? అని ఆలోచిస్తున్నారా! ఆమె ఎవరో కాదు.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి. ఆమె కథేంటో తెలుసుకుందాం..
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి పాయల్ ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో నిరాడంబరంగా జీవిస్తున్నారు. మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో ఓ చిన్న టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే.. గతుకుల రోడ్లపై అనేక కష్టాలు పడాలి. వర్షం పడిందంటే అక్కడికి వెళ్లడం చాలా కష్టం. ఆలయానికి 2 కిలోమీటర్ల ముందే వాహనాన్ని నిలిపి నడుస్తూ వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు యోగి సోదరి శశి పాయల్. ఇటీవల భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్లిన పర్యటకులు.. ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఫొటోలు దిగారు. యోగితో చిన్నతనంలో ఆమెకు ఉన్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి.. తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.