స్వాతంత్ర్య పోరాట సమయంలో జైలు శిక్ష అనుభవించిన నాయకులు దినచర్యలను తిరగేస్తే మాతృభూమిపై వారికి ఉన్న ప్రేమ అర్థమౌతుందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వారికి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది పాల్గొన్నట్లు తెలిపారు. వారి విరోచిత గాథల్లో ఎటువంటి స్వార్థం లేదన్నారు.
అనేక పోరాటాలతో సంపాదించుకున్న స్వాంతంత్ర్యానికి 75 ఏళ్లు నిండుతోన్న సందర్భంగా ప్రజలు వారి స్ఫూర్తిదాయకమైన కథలను, బలిదానాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. మనం జరుపుకునే వార్షికోత్సవాలలో కూడా వారికి తగిన స్థానం కల్పించాలని కోరారు. ఈ క్రమంలో స్వాతంత్ర్య సంగ్రామంలో వీరసావర్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి.