తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గవర్నర్లు మార్పునకు సూత్రధారులుగా పనిచేయాలి' - వెంకయ్య నాయుడు న్యూస్ టుడే

గవర్నర్లు మార్పునకు సూత్రధారులుగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(venkaiah naidu news) సూచించారు. రాష్ట్రపతి భవన్​లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఈ విధంగా మాట్లాడారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండే బాధ్యతలను స్వీకరించడంతోపాటు అనుభవం ఉన్న రాజనీతిజ్ఞులుగా కూడా బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

venkaiah naidu
వెంకయ్య నాయుడు

By

Published : Nov 12, 2021, 5:05 AM IST

దేశాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా వారిని చైతన్యపరచాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(venkaiah naidu news) సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు, ఆరోగ్య సంరక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, ప్రజాజీవితంలో నైతిక విలువలపై వెంకయ్యనాయుడు మాట్లాడారు. 'సబ్ కా సాత్‌.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజాభాగస్వామ్యం పెరగడంలో కృషి చేయడంతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ సమర్థంగా అమలు కావడంలోనూ చొరవ తీసుకోవాలన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రజాజీవితంలో విస్తృతమైన అనుభవం ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. పథకాల అమలు సమర్థంగా జరగడంలో తమ అనుభవాన్ని, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.

"మీరంతా మార్పునకు సూత్రధారులుగా పనిచేయాలి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండే బాధ్యతలను స్వీకరించడంతోపాటు అనుభవం ఉన్న రాజనీతిజ్ఞులుగా కూడా మీ బాధ్యతను నిర్వర్తించాలి. వాతావరణ మార్పులపై ఆందోళన వెల్లువెత్తుతున్న సమయంలో మొక్కల పెంపకం, జల సంరక్షణ, చెత్త నిర్వహణ వంటి పర్యావరణ అనుకూల చర్యలు చేపట్టే దిశగా ప్రజలను ప్రోత్సహించాలి. రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా, వారి ఉత్పత్తుల విలువను పెంచే చర్యలను ప్రోత్సహించాలి. 100 కోట్ల కరోనా టీకాలను ప్రజలకు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృంద స్ఫూర్తితో పనిచేశాయి. టీకాపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు ప్రజలందరూ టీకా తీసుకునే విషయంలో చైతన్య పరచడంలోనూ చొరవ తీసుకోవాలి" అని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details