ఒడిశాలోని గిరిజన జనాభాకు కొవిడ్ పెద్దగా సోకలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గిరిజనుల సంప్రదాయాలు, విశిష్టమైన ఆచార వ్యవహారాలే ఇందుకు కారణం అని చెప్పారు. ఒడిశాలోని ఉత్కల్ యూనివర్సిటీ 50వ స్నాతకోత్సవంలో ఈ మేరకు ప్రసంగించారు. దేశంలో 89,129 కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
"గిరిజనులు ఇతరులతో నడిచేటప్పుడు అలవాటుగానే కొంత దూరం పాటిస్తారు. సురక్షిత దూరం, పరిశుభ్రమైన విధానాలకు తోడు సహజమైన ఆహార అలవాట్లు కొవిడ్ సోకకుండా గిరిజనులను కాపాడాయి. వీరు ఆచరించే మంచి అలవాట్లపై యూనివర్సిటీలు దృష్టి సారించాలి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే మన మొదటి ప్రాధాన్యత. వీరి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలి. ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. వీరు ఎదుర్కొనే సమస్యల పట్ల పరిశోధనలు చేయాలి. వారి అభివృద్ధికి పాటుపడాలి."