Vice President Jagdeep Dhankad: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగ్దీప్ ధన్‌ఖడ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 725 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా జగ్దీప్ ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు పోలయ్యాయి. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు.. 182 మంది సభ్యులు ఓటేశారు. మరో 15 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు వెల్లడించారు. 55 మంది ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోలేదు.
మోదీ శుభాకాంక్షలు.. భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన జగ్దీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జగ్దీప్ ధన్‌ఖడ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. దిల్లీలోని ధన్‌ఖడ్ నివాసానికి మోదీ స్వయంగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా కూడా ధన్‌ఖడ్ నివాసానికి వెళ్లారు.
ఓటమిని అంగీకరించిన ఆళ్వా..ఉమ్మడి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మార్గరెట్ ఆళ్వా తన ఓటమిని అంగీకరించారు. జగ్దీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా.. జగ్దీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం, విస్తృత అనుభవం, ప్రజల సమస్యలపై లోతైన అవగాహన కచ్చితంగా దేశానికి ప్రయోజనం చేకూరుస్తాయి." అంటూ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ట్వీట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ధన్‌ఖడ్‌కు అభినందనలు తెలియజేశారు.