Vibrant Gujarat Global Summit 2024 :గుజరాత్లోనిఅహ్మదాబాద్లో ప్రధాని నేరంద్ర మోదీ, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రోడ్‌షో నిర్వహించారు. దేశాధినేతలకు రహదారికి ఇరువైపులా నిల్చుని, ఇరు దేశాల జాతీయ పతాకాల పట్టుకుని అహ్మదాబాద్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు, 'వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్- 2024'కు హాజరయ్యేందుకు భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడికి అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీ స్వాగతం పలికారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్‌ను ప్రారభించడానికి మంగళవారం గుజరాత్ చేరుకున్నారు ప్రధాని మోదీ. ఈ రెండు రోజుల పర్యటనలో పెట్టుబడుల సదస్సు, దానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటానని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
"ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సదస్సులో వివిధ ప్రపంచ నాయకులు పాల్గొంటారు. నా సోదరుడు (యూఏఈ అధ్యక్షుడు) మహ్మద్ బిన్ జాయెద్ రావడం చాలా ప్రత్యేకం. వైబ్రంట్ గుజరాత్ సమిట్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ వేదిక గుజరాత్‌కు ఎలా తోడ్పడిందో, అనేక మందికి అవకాశాలను ఎలా సృష్టించిందో చూసి నేను సంతోషిస్తున్నాను"
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
13 థీమ్‌లతో ప్రదర్శనలు
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్‌ను ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. బుధవారం శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ ప్రదర్శనలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లోని హెలీప్యాడ్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ కేంద్రలో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ గుజరాత్, మహిళా సాధికారత, ఎమ్ఎస్ఎమ్ఈ అభివృద్ధి, కొత్త సాంకేతిక వంటి 13 రకాల థీమ్‌లతో 13 హాళ్లు ఏర్పాటు చేశారు.
ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోదీ భేటీ
గుజరాత్లో పెట్టుబడలు సదస్సు నేపథ్యంలో మంగళవారం బిజీబిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉదయం టిమోర్ లెస్టే / ఈస్ట్ టిమోర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టా, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్సూసితో జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. భారత్‌తో ఆ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమయ్యారు. సుజుకీ మోటార్ కార్ప్, మైక్రోన్ టెక్నాలజీస్, ఏపీ మొల్లర్ ప్రతినిధులతో భేటీ అయ్యి, పరిశ్రమ సమస్యలపై చర్చించారు.
మాల్దీవులు మంత్రులపై టూరిజం ఇండస్ట్రీ ఫైర్- ఆయనపై పార్లమెంట్ విచారణ!
లక్షద్వీప్ టూరిజంపై భారత్ స్పెషల్ ఫోకస్- మరో ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు