పెద్ద నోట్ల రద్దు అంశంపై అఫిడవిట్ దాఖలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణను వాయిదా వేయడం కోర్టుకు అవమానకరమని పేర్కొంది. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. సవివర అఫిడవిట్ సమర్పించాలని అక్టోబర్ 11న కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు, ఆర్బీఐ బోర్డు నిర్ణయాలు, నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
ఈ అంశం బుధవారం జస్టిస్ ఎస్ఏ నజీర్‌తో సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాగా.. సమగ్ర అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రానికి మరింత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అఫిడవిట్ సమర్పించడంలో జాప్యానికి క్షమాపణ చెప్పిన ఆయన.. మరో వారం గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన కోర్టు అటార్నీపై అసనహనం వ్యక్తం చేసింది. "సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం ఇలా వాయిదా పడదు. మేము ఇలా లేచి వెళ్లిపోలేము. ఇది కోర్టుకు చాలా అవమానకరం" అని వ్యాఖ్యానించింది. దీనికి స్పందించిన అటార్నీ.. తనకు కూడా ఇది ఇబ్బందికరంగానే ఉందని చెప్పారు.