దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందితో చాలా మందికి ఆక్సిజన్‌పై చికిత్స అందించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆక్సిజన్, ఔషధాల కొరతతో కరోనా కట్టడి క్లిష్టంగా మారింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోయాయి. ప్రస్తుత సమయంలో కరోనాను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పీఎం కేర్స్ నిధుల నుంచి గత ఏడాది రాష్ట్రాలకు వెంటిలేటర్లు సరఫరా చేశారు. కానీ, చాలా రాష్ట్రాల్లో వాటిని వినియోగించటం లేదని తెలుస్తోంది. వాటిని ఓ మూలన పడేయటం లేదా వాటి నిర్వహణకు సరైన సాంకేతిక సిబ్బంది లేకపోవటం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని వెంటిలేటర్లు నిరూపయోగంగా మారాయో ఓసారి పరిశీలిద్దాం.
- బిహార్:గత ఏడాది పీఎం కేర్స్ నిధుల నుంచి 30 వెంటిలేటర్లు అందాయి. కానీ, ఒక్క దానినీ ఉపయోగించలేదంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో సాంకేతిక నిపుణుల కొరత అధికంగా ఉంది. ప్రాణాలు రక్షించే ఈ యంత్రాలను ప్యాక్ చేసి మూలన పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 207 వెంటిలేటర్లు నిరుపయోగంగా మారాయి. అందుకు సాంకేతిక నిపుణుల కొరతే కారణంగా తెలుస్తోంది. మొత్తం 31 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 6 వెంటిలేటర్లు పనిచేయటం లేదు. గత ఏడాది 1700 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించేందుకు ప్రక్రియ చేపట్టినా.. ఇప్పటికీ వాటి ఫలితాలు వెల్లడించలేదు.
- పంజాబ్:పీఎం కేర్స్ నిధుల నుంచి 809 వెంటిలేటర్లు అందాయి. అందులో 558 మాత్రమే ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన 251 వెంటిలేటర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని బిగించేందుకు ఒకే ఒక్క ఇంజినీర్‌ను నియమించటం ఇందుకు కారణం.
వెంటిలేటర్లు నిరూపయోగంగా మారటంపై ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫరీద్‌కోట్‌లోని గురు గోవింద్ సింగ్ వైద్య కళాశాలలో మొత్తం 70 వెంటిలేటర్లు పక్కన పడేశారని పేర్కొన్నారు.
మరోవైపు.. పీఎం కేర్స్ నుంచి 82 వెంటిలేటర్లు రాగా.. ప్రస్తుతం 62 పనిచేయటం లేదని కళాశాల వైస్ ఛాన్సిలర్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. అందుకు నిపుణుల కొరత, నాణ్యత లోపం వంటి కారణాలు చూపారు.
పీఎం కేర్స్ నిధుల ద్వారా పంజాబ్ ఫరీద్‌కోట్‌లోని జీజీఎస్ వైద్య కళాశాలకు పాడైపోయిన వెంటిలేటర్లు అందించారన్న వార్తలను ఖండించింది కేంద్రం. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకనే వెంటిలేటర్లు నిరుపయోగంగా మారాయని పేర్కొంది. - కర్ణాటక:పీఎం కేర్స్ నుంచి 3,025 వెంటిలేటర్లు అందాయి. అందులో 1,859 వెంటిలేటర్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగతా 1,166 నిరుపయోగంగా మారాయి.
- రాజస్థాన్:1900 వెంటిలేటర్లు పీఎం కేర్స్ నిధుల నుంచి వచ్చాయి. అన్ని వెంటిలేటర్ల పనితీరును పరిశీలించటం పూర్తయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 90 శాతం వెంటిలేటర్లు పని చేస్తున్నాయి. 10 శాతం వాటిల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.
- హిమాచల్ ప్రదేశ్:పీఎం కేర్స్ నిధుల నుంచి 500 వెంటిలేటర్లు అందించింది కేంద్రం. రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం మే 12 వరకు అందులో 48 మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన 452 వెంటిలేటర్ల అవసరం రాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో వెంటిలేటర్లు అవసరమైన రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది. అన్నీ పని చేస్తున్నాయని, అవసరమైనప్పుడు వినియోగిస్తామని తెలిపింది.
- కేరళ:480 వెంటిలేటర్లు పీఎం కేర్స్ నిధుల నుంచి అందాయి. సాంకేతిక కారణాలతో అందులోని 36 వెంటిలేటర్లను వినియోగించటం లేదు. ఈ సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరించి వాటిని సైతం అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- ఉత్తరాఖండ్:గత ఏడాది పీఎం కేర్స్ నిధుల ద్వారా 700 వెంటిలేటర్లు అందించింది కేంద్రం. అందులోని 670 వెంటిలేటర్లను వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. ఇంజినీర్ల కొరత కారణంగా మిగిలిన 30 వెంటిలేటర్లు నిరుపయోగంగా మారాయి. ఏ ఒక్క వెంటిలేటర్లో సమస్యలు లేవని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముంబయి సహా ఇతర రాష్ట్రాల నుంచి ఇంజినీర్లను పిలిపిస్తున్నట్లు వెల్లడించింది.
- ఛత్తీస్‌గఢ్:పీఎం కేర్స్ నిధుల నుంచి 230 వెంటిలేటర్లు ఛత్తీస్‌గఢ్‌కు అందాయి. అందులోని 70 వెంటిలేటర్లలో సాంకేతిక లోపాలు గుర్తించామని, ప్రస్తుతం 60 వెంటిలేటర్లను బాగుచేసి వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 10 వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నట్లు వెల్లడించింది.
- దిల్లీ:పీఎం కేర్స్ నిధుల నుంచి దిల్లీకి 990 వెంటిలేటర్లు అందాయి. దిల్లీలోని ఆసుపత్రుల్లో వీటన్నింటినీ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని పలు ఆసుపత్రులు తెలిపాయి.
దిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1200 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.