Venkaiah Naidu launched the book written by Tummala Kishore: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు తుమ్మల కిషోర్ రచించిన 'దేశ ఆర్థిక ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు - సంక్షోభాలు- సంస్కరణలు' పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. పుస్తక రచయిత కిషోర్ రచించిన గత వ్యాసాలను ఈనాడు దినపత్రికలో తరుచూ చదువుతుండేవాడినని గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు.... భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక మాంద్యమాన్నిఅధిగమించగలమని తెలిపారు. ఈ దిశగా కిషోర్ రచించిన పుస్తకం ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ ఆయనను అభినందించారు. బ్యాంకింగ్ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవంతో ఆర్థిక రంగంపై మంచి పట్టు సంపాదించుకున్న కిషోర్.... ఈనాడులో 800కుపైగా వ్యాసాలు రాశారు. 'సెక్యూరిటీల కుంభకోణం', 'పెద్దనోట్ల రద్దు', 'మాంద్యం ముంగిట దేశం' రచనలు కిషోర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈనాడు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ఎమ్మెస్కో పబ్లిషర్స్ అధినేత విజయ్ కుమార్, సంపాదకులు డాక్టర్ డి.చంద్రశేఖర్ రెడ్డి హాజరై తుమ్మల కిషోర్‌కు అభినందనలు తెలిపారు.
ప్రజోపయోగకరమైన పుస్తకం: తుమ్మల కిశోర్.. ప్రజోపయోగకరమైన పుస్తకం రాశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న, అధిగమించిన సవాళ్లను ఈ పుస్తకంలో చక్కగా విశదీకరించారని ప్రశంసించారు. దేశంలో ఆర్థిక సంస్కరణల వచ్చిన సానుకూల ఫలితాలు, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వెనక జరిగిన కృషి వంటి అంశాలను సావధానంగా విశ్లేషించడంతో పాటు, క్లిష్టమైన అంశాలపై సులభరీతిలో అవగాహన కల్పించే విధంగా పుస్తకాన్ని వెలువరించడం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి పుస్తకాలు ఆలోచనలను పెంచుతాయని, వాటిని అందరితోనూ పంచుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నవతరం ఇలాంటి పస్తకాలు చదవాలని సూచించారు. పత్రికాపఠనం, పుస్తక పఠనం ఎంతో ఎంతో అవసరమని, ప్రింట్లో ఉండే విషయం అధికంగా ప్రభావం చూపిస్తుందని అన్నారు. మంచి పుస్తకాలు రాయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రచురించేవారు ముందుకు రావడమూ అంతే ముఖ్యమని చెప్పారు.