తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భ్రష్టుపడుతోన్న రాజకీయాలను యువతే బాగుచేయాలి : వెంకయ్య నాయుడు - వెంకయ్యనాయుడు హన్మకొండ టూర్

Venkaiah Naidu comments on Politics : భారతీయ భావనను విద్యా విధానం ప్రతిబింబించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలు భ్రష్టపట్టిపోతున్న తరుణంలో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్న కొన్ని రాజకీయ శక్తుల కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమస్త భారతదేశమంతా ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు.

Venkaiah Naidu
Venkaiah Naidu

By

Published : Mar 4, 2023, 12:27 PM IST

భ్రష్టుపడుతోన్న రాజకీయాలను యువతే బాగుచేయాలన్న వెంకయ్య నాయుడు

Venkaiah Naidu comments on Politics :కులమతాల పేరుతో కొందరు రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు జనాన్ని చీల్చుతున్నారని.. వారి కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు. చట్ట సభల్లో ప్రజా సమస్యలపై చర్చలు సక్రమంగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. రాజకీయాలు తప్పుదారిన పడుతున్నాయని.. తప్పుదారి పట్టిన రాజకీయాలను బాగు చేసే బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. రాజకీయాలు భ్రష్టుపట్టిపోతున్న తరుణంలో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సమస్త భారతదేశమంతా ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు.

Venkaiah Naidu in Hanumakonda Tour : హన్మకొండ జిల్లా కేంద్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవానికి వెంకయ్య హాజరయ్యారు. పీజీ, డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలతో పాటు ఇతర విద్యార్థులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య విద్యార్థుల ఆత్మహత్యలు, నేటి విద్యా విధానం, రాజకీయాలు, రాజకీయాల్లోకి యువత అడుగుపెట్టాల్సిన అవసరం వంటి పలు అంశాలపై ప్రసంగించారు. ప్రజల ప్రశాంత జీవనానికి విద్య తోడ్పడాలని వెంకయ్య అన్నారు.

'ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం గురించి మీడియాలో చూస్తున్నాను. ఒత్తిడి పెరుగుతోందని కొందరు.. మార్కుల కోసం పోటీ పడలేక పోతున్నామని మరికొందరు.. ఇంట్లో అమ్మానాన్న తిడుతున్నారని ఇంకొందరు.. ఇవన్నీ దాటొచ్చినా.. ప్రేమలో విఫలమయ్యామని కొందరు.. ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి బంగారు భవిష్యత్‌ను మూణ్నాళ్ల ముచ్చట చేసుకుంటున్నారు. చివరకు వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి వింటుంటే చాలా బాధగా ఉంది. విద్యాసంస్థలు చదువొక్కటే లోకంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకూడదు. విద్యార్థులు కూడా మార్కులు రాకపోతే జీవితం వృథా అన్న భావనలో ఉండకూడదు. ఇందుకు వారి తల్లిదండ్రులు సహకరించాలి. పిల్లలు చదువులో వెనకబడితే వారిని ప్రోత్సహించాలి తప్ప నిరుత్సాహపరచకూడదు. నేటి విద్యార్థులే రేపటి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తారు. ' -వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి

ప్రకృతిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం యువత నేర్చుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాషను మరిచిపోవద్దని మరీ మరీ చెప్పారు. విద్య వ్యాపారం కాకూడదన్న వెంకయ్య.. భారతీయ భావనను విద్యా విధానం ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. నాటి సంస్కృతి, నేటి ఆధునిక పరిజ్ఞానం జోడెద్దులుగా విద్యా విధానంలో అమలు కావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details