కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కొన్ని రాష్ట్రాల కఠిన నిబంధనల నేపథ్యంలో.. మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. హడావుడిగా బయటకు వెళ్లిన చాలా మంది 'అయ్యో! మాస్క్ మర్చిపోయామే!' అని తలపట్టుకోవాల్సి వస్తోంది. మాస్క్ లేకుండా పట్టుబడితే అధికారులు విధిస్తున్న జరిమానా వివరాలు చూస్తే ఈ పరిస్థితి అర్థమవుతుంది. అయితే.. ఇలాంటి వారికోసం వినూత్నంగా ఆలోచించి ఓ యంత్రాన్ని తయారు చేశారు సూరత్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త. ఒక్క రూపాయి లేదా ఐదు రూపాయల కాయిన్‌ను మిషిన్‌లో వేస్తే.. బయటకు మాస్క్ వస్తుంది. ఆమె స్నేహితుడి సాయంతో ఈ మిషన్‌ను రూపొందించారు. ఈ మిషన్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని ధీమాగా ఉన్నారు.
"మాస్క్ ధరించని వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫైన్లు విధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాస్క్ మరిచిపోయిన వారికోసం ఈ వెండింగ్ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యంత్రంలో 100 నుంచి 5000 మాస్క్‌లు పొందుపరిచే అవకాశం ఉంది. రూపాయి లేదా ఐదు రూపాయల నాణెం వేసి ఈ మాస్క్ పొందొచ్చు. స్వచ్ఛంద సంస్థల సహాయంతో బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లోనూ ఈ మిషన్‌ను ఏర్పాటు చేస్తాం."
--రూపా షా, సామాజిక కార్యకర్త.
ఈ మిషన్‌ను ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెబుతున్నారు మిషన్ రూపకర్తలు.