దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల ఆక్సిజన్‌ను నల్లబజారులో విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరా చేసే అన్ని రకాల వాహనాలను జీపీఎస్‌తో ట్రాకింగ్ చేయాలని నిర్ణయించింది. అన్ని వాహనాలకు వీఎల్‌టీ పరికరాన్ని అమర్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.
'ఆక్సిజన్ కంటైనర్లు/ట్యాంకర్లు/వాహనాలకు తప్పనిసరిగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్(వీఎల్‌టీ) పరికరాన్ని అమర్చడం తప్పనిసరి' అని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. సరఫరాలో ఆలస్యం, దారిమళ్లించడం వంటి వాటిని నిరోధించడంతో పాటు ట్యాంకర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ జీపీఎస్ ట్రాకింగ్ వినియోగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.