Vastu Tips for Placement of Goddess Lakshmi Devi Idol :వాస్తు ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉండటం శుభ సూచికమని అంటారు. అయితే.. లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉండడమే కాదు.. దేవీ విగ్రహ ప్రతిష్ఠాపన విషయంలోనూ వాస్తు నియమాలు తప్పక పాటించాలట. సరైన దిశలో అమ్మవారి విగ్రహం ఉంచాలట. అప్పుడే సకల సంపదలు సిద్ధించడంతోపాటు విశేష ప్రయోజనాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాకాదని ఎలాంటి నియమాలూ పాటించకుండా లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే.. చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వాస్తు ప్రకారం ఎలాంటి నియమాలు పాటించాలి? అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూజామందిరంలో ప్రతిష్ఠించాలి?అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
లక్ష్మీ, గణపతి విగ్రహాలను కలిపి ఉంచవద్దు :అందరి ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు లేదా చిత్రపటాలు దాదాపుగా ఉంటాయి. అయితే వీటిని ప్రతిష్ఠించే విషయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తారు. దాంతో లక్ష్మీ కటాక్షం పొందడం అటుంచితే.. దరిద్రం వెంటాడొచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని గణపతి విగ్రహంతో కలిపి ఎప్పుడూ ఉంచకూడదట. చాలా మంది పండగల వేళల్లో ఇద్దరు దేవతలను పక్క పక్కనే ఉంచి పూజిస్తారు. ఒకవేళ ఇద్దరినీ ఏకకాలంలో పూజించాలంటే.. గణపతికి కుడివైపున మాత్రమే లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలట! ఈ విషయం తెలియక చాలా మంది వినాయకుడికి ఎడమవైపున అమ్మవారిని చిత్రపటాన్ని పెడుతుంటారు. వాస్తుప్రకారం అది చాలా పెద్దపొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహాం ఉండకూడదు :అంతేకాదు..వాస్తుప్రకారం లక్ష్మీదేవి ప్రతిష్ఠాపనలో మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. పూజామందిరంలో ఎప్పుడూ లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహాన్ని ఉంచుకోకూడదట. అలాంటి రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు శూన్యమని చెబుతున్నారు. ఎందుకంటే నిల్చున్న లక్ష్మీదేవి చిత్రపటం ఆమె ప్రయాణాన్ని సూచిస్తుందట! అంటే.. ఇంటి సంపద బయటికి వెళ్లిపోతుందని అంటున్నారు. అందుకే పండితులు మీ పూజాగదిలో ఎప్పుడూ కమలంపై, సంతోషకరమైన భంగిమలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెబుతున్నారు.