వాస్తు శాస్త్ర నిపుణుడిగా మహారాష్ట్ర, కర్ణాటకలో పేరొందిన చంద్రశేఖర్ గురూజీ.. దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటక హుబ్బళిలోని ఓ హోటల్ రిసెప్షన్లో మంగళవారం ఇద్దరు ఆగంతుకులు ఆయన్ను కిరాతకంగా అనేక సార్లు కత్తితో పొడిచి చంపారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ప్రముఖ వాస్తు సిద్ధాంతి హత్య.. సీఎం సీరియస్ - vastu expert chandrashekhar murder
ప్రముఖ వాస్తు సిద్ధాంతి హత్యకు గురి కావడం.. కర్ణాటకలో కలకలం రేపింది. ఓ హోటల్ రిసెప్షన్లో ఆయన్ను ఇద్దరు దుండగులు కిరాతకంగా పొడిచి చంపారు.
చంద్రశేఖర్‌ది.. కర్ణాటకలోని బాగల్కోటె. కాంట్రాక్టర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత ఉద్యోగం రాగా ముంబయి వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. అనంతరం వాస్తు శాస్త్ర నిపుణుడిగా మారారు. బంధువుల్లో ఒకరు మరణించారని.. మూడు రోజుల క్రితం హుబ్బళి వచ్చారు చంద్రశేఖర్. మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హుబ్బళి పోలీస్ కమిషనర్ లాభూ రామ్ ఘటనా స్థలానికి వెళ్లి, స్వయంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
"కొందరు చంద్రశేఖర్ ఉంటున్న హోటల్‌కు వచ్చారు. లాబీలోకి రావాలని పిలిచారు. చంద్రశేఖర్ రాగానే ఓ వ్యక్తి నమస్కారం పెట్టాడు. వెంటనే కత్తితో పొడవడం ప్రారంభించాడు. తీవ్ర గాయాలు కావడం వల్ల.. చంద్రశేఖర్‌ను ఆస్పత్రికి తరలించేసరికే చనిపోయారు. కేసు నమోదు చేశాం. నిందితుల కోసం గాలిస్తున్నాం" అని చెప్పారు పోలీస్ కమిషనర్.
పట్టపగలే చంద్రశేఖర్‌ను చంపడం దారుణమన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. సీసీటీవీ కెమెరాల వీడియోలో కనిపించిన నిందితుల్ని తక్షణమే పట్టుకోవాలని పోలీస్ కమిషనర్‌కు సూచించినట్లు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.