దేశంలో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్. కేవలం 34 రోజుల్లోనే కోటి డోసుల మార్కును చేరుకొని ప్రపంచంలో.. అమెరికా తర్వాత అత్యంత వేగంగా టీకా అందించిన రెండో దేశంగా నిలిచామన్నారు. అతిపెద్ద టీకా పంపిణీ కోసం 2.11 లక్షల సెషన్లు నిర్వహించామన్నారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటీ 4 లక్షల 49 వేల 942 టీకా డోసులు అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్కరోజే సుమారు 6 లక్షలకు పైగా టీకా డోసులు అందించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం వరకు 70 లక్షల డోసులు ఆరోగ్య కార్యకర్తలకు, 33 లక్షలకుపైగా డోసులు.. పారిశుద్ధ్య కార్మికులకు అందించామన్నారు. అదేసమయంలో 6లక్షల మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోసు తీసుకున్నారని వివరించారు.
ప్రతీ ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. పారిశుద్ధ్య కార్మికులకు విజ్ఞప్తి చేశారు. టీకాలు పూర్తిగా సురక్షితమైనవని.. రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు.
''ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు షెడ్యూల్ ప్రకారం కొవిడ్-19 టీకా డోసులు వేయించుకోండి. టీకాలు సురక్షితమైనవే. వీటి సమర్థతపై ఎటువంటి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు.''
-డాక్టర్హర్ష వర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి.