Smart Women Safety Mask: కరోనా కాలంలో మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నాం. మాస్క్ ఉంటే మహమ్మారి నుంచి రక్షణ ఉంటుందని మన ధీమా. ఇందులో క్లాత్ మాస్క్, ఎన్95 అంటూ ఎన్నో రకాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి స్మార్ట్ మాస్క్ చేరింది. ఇది మిగతా వాటికన్నా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం వైరస్ల నుంచే కాదు ఆపదల నుంచి కూడా రక్షిస్తుంది. అవును మీరు విన్నది నిజమే.. ఈ మాస్క్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా రూపొందించారు.
వైరస్ నుంచి రక్షణ కల్పించే మాస్కే.. మహిళలకు కూడా ఎందుకు రక్షణ కల్పించలేదన్న శ్యామ్ ఆలోచన నుంచి ఈ స్మార్ట్ మాస్క్ పుట్టుకొచ్చింది. ఇదే ఇప్పుడు మహిళలకు రక్షణ కవచంలా మారింది. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ శక్తి యోజన కింద శ్యామ్ ఈ మాస్క్‌ను తయారు చేశారు. ఇందుకోసం సాధారణ మాస్క్‌కు ఓ ప్రత్యేకమైన సెన్సార్‌ను అమర్చారు. బ్లూటూత్ ద్వారా ఈ మాస్క్‌ను ఫోనుకు కనెక్ట్ చేసుకోవచ్చు. మాస్క్‌పైన ఉన్న సెన్సార్‌ను ప్రెస్ చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్నా సరే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది. లొకేషన్ వివరాలు తెలుస్తాయి. హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు ఎమర్జెన్సీ కోసం రిజిస్టరైన మరో నంబర్‌కు కూడా ఈ స్మార్ట్మాస్క్ సందేశాన్ని పంపిస్తుంది.
ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ మాస్క్‌ల తయారీ మరింత విస్తృతం చేసే అవకాశం ఉందంటున్నారు శ్యామ్.