Vande Mataram Song On Kite Thread :23 సెంటిమీటర్ల గాలిపటం దారంపై జాతీయ గేయాన్ని రాసి రికార్డు సాధించాడు దిల్లీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ అతుల్ కశ్యప్. 20 నిమిషాల్లోనే 'వందేమాతరం' గేయాన్ని దారంపై రాసేశాడు. అతడి ప్రతిభను గుర్తించి ధ్రువపత్రాన్ని అందించింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్.
అతుల్ కశ్యప్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్. గత పదేళ్లుగా అతడు కుటుంబంతో కలిసి దిల్లీలోని గోవింద్‌పురి కల్కాజీలో నివాసం ఉంటున్నాడు. మైక్రో ఆర్ట్‌లో ఆసక్తి ఉన్న అతడు.. ఇప్పటికే వివిధ కళారూపాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. త్వరలో 3 మిల్లీ మీటర్ల చిన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాసేందుకు సిద్ధమయ్యాడు.
"మైక్రో ఆర్ట్ అనేది నా అభిరుచి. నన్ను నేను కాస్త వైవిధ్యంగా చూసుకునేందుకు నా ఈ కళను ప్రపంచానికి చూపించాలనుకున్నా. నా ప్రతిభకు మీ(మీడియా) ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. 23 సె.మీల దారంపై 20 నిమిషాల్లో జాతీయ గేయాన్ని రాసేందుకు నేను సుదీర్ఘంగా సాధన చేశాను. ఇందుకోసం సుమారు 6 నెలలు దారాలపై రాస్తూ రాస్తూ పట్టు సాధించాను. అంతేకాకుండా 2005లో కాన్పుర్ విశ్వవిద్యాలయంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఆవగింజపై 'ఐ లవ్ మై ఇండియా' అని రాశాను. ఇది పేపర్లలో కూడా వచ్చింది. ఇక 3మి.మీల పుస్తకంపై హనుమాన్ చాలీసా రాసేందుకు పుస్తకం కూడా సిద్ధం చేశాను. అందులో రాయాల్సి ఉంది. ప్రస్తుతం సాధన చేస్తున్నాను."
- అతుల్ కశ్యప్, మైక్రో ఆర్టిస్ట్