తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుమ్మురేపిన వందే భారత్‌, ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిమీ వేగం - Vande Bharat train records

వందేభారత్ రైలు దుమ్మురేపింది. ట్రయల్ రన్​లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్​లో పోస్టు చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 27, 2022, 4:09 PM IST

Vande Bharat express: దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు అయిన వందేభారత్‌ దుమ్మురేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Vande Bharat train: 2019లో తొలి వందేభారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూదిల్లీ- వారణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. దిల్లీ-వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా కోటా (రాజస్థాన్‌)- నగ్దా (మధ్యప్రదేశ్‌) సెక్షన్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకున్నట్లు కేంద్రమంత్రి తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.

రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌ చేసి దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. ఈ తరహా రైళ్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు 2022 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details