ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన.. రూ.1.5 కోట్ల సొమ్మును ఎత్తుకెళ్లాడు ఓ సెక్యూరిటీ సంస్థ వ్యాన్ డ్రైవర్. డబ్బును ఏటీఎమ్‌లో నింపేందుకు వచ్చి.. వ్యాన్‌తో సహా పరారయ్యాడు. తోటి సిబ్బంది కళ్లుగప్పి కోటిన్నర రూపాయలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బిహార్ రాజధాని పట్నాలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీకి చెందిన సిబ్బంది.. ఐసీఐసీఐ ఏటీఎమ్‌లో నగదు నింపేందుకు వచ్చారు. వ్యాన్‌లో రూ. 1.5 కోట్లతో డంకా ఎమ్లీ గోలంబార్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్‌కి చేరుకున్నారు. ఆ సమయంలో వ్యాన్‌లో ఓ గన్‌మెన్, సంస్థ ఆడిటర్, డ్రైవర్ ఉన్నారు. ఆడిటర్, గన్‌మెన్ వాహనం దిగి కాస్తా దూరం వెళ్లగానే.. వ్యాన్‌తో పాటు ఉడాయించాడు డ్రైవర్. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఆడిటర్.
అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను సురజ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆడిటర్, గన్‌మెన్.. పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎత్తుకెళ్లిన వ్యాన్ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. అనంతరం అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎన్ఎమ్సీఎచ్ రోడ్డు పక్కన వ్యాన్ నిలిపాడని.. అనంతరం వాహనంలో ఉన్న డబ్బును తీసుకుని కారులో పారిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని వారు వెల్లడించారు.